పరిహారం.. పరిహాసం
● 52 వేల ఎకరాల్లో ‘మోంథా’ పంట నష్టం
● పరిహారం ఇస్తామన్న ప్రభుత్వం
● నెలలు గడుస్తున్నా అందని సాయం
● రబీ పెట్టుబడికి రైతుల ఎదురుచూపులు
పిఠాపురం: కాలువల ఆధునీకరణ పేరుతో కూటమి నేతల దోపిడీ తప్ప అసలు పని సక్రమంగా జరగలేదు. ఫలితంగా పంటలకు పూర్తి స్థాయిలో నీరు అందలేదు. ఈ ఇబ్బందుల నడుమ అప్పులు చేసి.. పెట్టుబడులు పెట్టి.. సాగు ఆరంభిస్తే.. ఎరువుల కొరత వెంటాడింది. యూరియా కోసం అన్నదాతలు యుద్ధాలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాగోలా గట్టెక్కుతున్నామనుకుంటున్న తరుణంలో అధిక వర్షాలు.. ఆపై మోంథా తుపాను నిండా ముంచేయడంతో జిల్లావ్యాప్తంగా వేలాదిగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. పరిహారం ఇచ్చి ఆదుకుంటుందనుకున్న ప్రభుత్వం రోజులు, నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదు. దీంతో, రబీ సాగుకు పెట్టుబడులు లేక మళ్లీ అప్పులు చేయాల్సిన దుస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారు.
పడిపోయిన దిగుబడులు
జిల్లాలో ఇప్పటికే 70 శాతం వరకూ ఖరీఫ్ వరి కోతలు పూర్తయ్యాయి. ఎకరా వరి సాగుకు రైతులు రూ.30 వేల వరకూ పెట్టుబడులు పెట్టారు. 35 బస్తాల వరకూ ధాన్యం దిగుబడి వస్తుందని ఆశ పడ్డారు. కానీ, మోంథా తుపాను ప్రభావంతో కోతల అనంతరం 15 నుంచి 20 బస్తాల దిగుబడి మాత్రమే వస్తోంది. వేలాది మంది రైతులు ఎకరాకు 5 నుంచి 10 బస్తాల వరకూ నష్టపోయి, అయోమయానికి గురవుతున్నారు. కనీసం పెట్టుబడి కూడా రావడం లేదని ఆవేదన చెందుతున్నారు. పుట్టెడు కష్టాల్లో ఉన్న రైతుల నుంచి ప్రభుత్వం కనీసం మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఫలితంగా ప్రైవేటు వ్యాపారులకే తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు.
పరిహారం కోసం పడిగాపులు
గత అక్టోబర్ ఆఖరు వారంలో వచ్చిన మోంథా తుపాను కాకినాడ తీరంలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ తొలుత అంచనా వేసింది. కానీ, అది అనూహ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వద్ద తీరం దాటింది. అయితే, దీని ప్రభావంతో వీచిన పెనుగాలులు, కురిసిన వర్షాలకు జిల్లాలో పెద్ద మొత్తంలో పంటలు నీట మునిగాయి. తుపాను వల్ల దెబ్బ తిన్న వరికి ఎకరాకు రూ.10 వేలు, మిగిలిన పంటలకు రూ.6 వేల చొప్పున పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి అన్ని పంటలూ కలిపి జిల్లావ్యాప్తంగా రైతులు రూ.150 కోట్ల పైనే నష్టపోగా ప్రభుత్వం మాత్రం రూ.52.17 కోట్లుగా తేల్చింది. తుపాను అనంతరం 10 రోజుల్లో వ్యవసాయ అధికారులు నష్టం అంచనాలను ప్రభుత్వానికి నివేదించారు. కానీ, అయితే నేటి వరకూ నయాపైసా కూడా పరిహారం అందించలేదు. ఖరీఫ్ నష్టాలను రబీలోనైనా కొంత భర్తీ చేసుకుందామని పలువురు ఆశ పడుతున్నారు. ఇచ్చే అరకొర పరిహారమైనా ప్రభుత్వం త్వరితగతిన ఇస్తే సాగు పెట్టుబడికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే పంట నష్టపరిహారం విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.
పరిహారం అందక ఇబ్బందులు
ఎన్నో ఇబ్బందులను అధిగమించి పంటలు సాగు చేశాం. వారం రోజుల్లో పంట చేతికందుతుందనుకునే లోపు మోంథా తుపాను పూర్తిగా తుడిచిపెట్టేసింది. తీవ్ర నష్టాల పాలయ్యాం. రబీ పంటకు పెట్టుబడులు లేక, పంట నష్ట పరిహారం వస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. నెలలు గడుస్తున్నా పరిహారం ఇవ్వడం లేదు. మళ్లీ అప్పులు చేసి పంటలు సాగు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం వెంటనే పరిహారం అందించాలి.
– సకినాల అబ్బాయి,
రైతు, దుర్గాడ, గొల్లప్రోలు మండలం
దారుణం
మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో వరితో పాటు బొప్పాయి, అరటి, పూలతోటలు, కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. రైతులకు జరిగిన నష్టం పూడ్చలేనిది. ప్రభుత్వం పంట నష్టం నమోదు చేయించింది కానీ, పరిహారం ఇవ్వకపోవడం దారుణం. రబీ సాగుకు సిద్ధమవుతున్న రైతుకు వెంటనే పంట నష్టపరిహారం ఇచ్చి, ఆదుకోవాలి. అన్ని పంటలకూ బీమా సౌకర్యం కల్పించాలి.
– వంగా గీతా విశ్వనాథ్, వైఎస్సార్ సీపీ
నియోజకవర్గ ఇన్‌చార్జి, పిఠాపురం
జిల్లాలో ఖరీఫ్ పంట నష్టాలు ఇలా..
వరి సాగు విస్తీర్ణం 2.23 లక్షల ఎకరాలు
నష్టం 49,473 ఎకరాలు
ఇతర పంటల విస్తీర్ణం సుమారు 70 వేల ఎకరాలు
నష్టం 52 వేల ఎకరాలు
నష్టపోయిన రైతులు 46,929
రావాల్సిన పరిహారం రూ.52 కోట్లు
పరిహారం.. పరిహాసం
పరిహారం.. పరిహాసం


