నూతన సత్రం నిర్మాణానికి అడుగులు
● సీతారామ సత్రం కూల్చివేత ప్రారంభం
● అక్కడే తొలి దశలో 105 గదులతో
మరో సత్రం నిర్మాణం
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో శిధిలావస్థకు చేరిన శ్రీ సీతారామ సత్రం కూల్చివేత పనులు ఎట్టకేలకు ప్రారంభించారు. ఈ నెలాఖరుకల్లా ఈ పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. రత్నగిరిపై సుమారు 38 సంవత్సరాల క్రితం 100 గదులతో సీతారామ సత్రాన్ని నిర్మించారు. దీనిని ఆంగ్ల అక్షరం ‘యు’ ఆకారంలో నిర్మించడంతో వివాహాలకు కూడా వీలుగా ఉండేది. ఒక్క ముహూర్తంలోనే ఇక్కడ దాదాపు 30, 40 వివాహాలు జరిగేవి. ఇది రెండేళ్ల క్రితమే శిథిలావస్థకు చేరింది. తాత్కాలిక మరమ్మతులు చేసి, భక్తులకు గదులు అద్దెకు ఇచ్చేవారు. అద్దె రూ.200 మాత్రమే కావడంతో పేద, మధ్య తరగతి భక్తులు ఎక్కువగా ఇక్కడ బస చేసేవారు. అయితే, సత్రం పరిస్థితి చూసి ఆందోళనకు గురయ్యేవారు. 2023 నవంబర్‌లో దేవస్థానం ఇన్‌చార్జి ఈఓగా బాధ్యతలు చేపట్టిన ప్రస్తుత దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఈ సత్రం శిథిలావస్థకు చేరిన విషయం గమనించారు. దీని ఫిట్‌నెస్‌పై నివేదిక ఇవ్వాలని ఆర్‌అండ్‌బీ అధికారులను అప్పట్లోనే కోరారు. వారు పరిశీలించి, ఈ సత్రం శిథిలావస్థకు చేరినందున కూల్చివేయాలని నివేదిక ఇచ్చారు. దాని ఆధారంగా సీతారామ సత్రం కూల్చివేసి, ఆ వ్యర్థాలను తొలగించేందుకు టెండర్ పిలిచి ఖరారు చేశారు. అలాగే, ఆ స్థలంలోని సగ భాగంలో ఎ–బ్లాక్ పేరిట 105 గదులతో నూతన సత్రం నిర్మించేందుకు గత ఏడాది మే నెలలో రూ.8.82 కోట్ల అంచనాతో టెండర్లు పిలిచారు. దీనిని 19.80 శాతం తక్కువగా రూ.7.07 కోట్లకు డీడీ గిరి కన్‌స్ట్రక్షన్స్ దక్కించుకుంది. ఆ తరువాత గత ఏడాది నవంబర్‌లో రామచంద్ర మోహన్ విజయవాడకు బదిలీ అయ్యారు.
సలహాదారు సూచనతో..
ఇదిలా ఉండగా గత ఫిబ్రవరిలో దేవదాయ శాఖ సలహాదారు కొండలరావు సీతారామ సత్రాన్ని పరిశీలించి, మరమ్మతులు చేస్తే సరిపోతుందని సిఫారసు చేశారు. దీంతో, గందరగోళం తలెత్తింది. సలహాదారు సూచనల ప్రకారం సత్రం మరమ్మతులకు సుమారు రూ.2 కోట్లు అవుతుందని అంచనా వేశారు. అయితే, ఆ తరువాత కూడా సత్రం కూలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై జూన్ 26న ‘సత్యదేవా చూడవయ్యా’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ స్పందించారు. సత్రాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని జేఎన్‌టీయూ–కాకినాడ ప్రొఫెసర్లను కోరారు. ఆ మేరకు సీతారామ సత్రం గదులు, శ్లాబ్, గోడలను గత ఆగస్టు 13న జేఎన్‌టీయూకే ప్రొఫెసర్లు వి.రవీంద్ర, జి.ఏసురత్నం పరిశీలించారు. దీనికి మరమ్మతులు చేసినా ఉపయోగం ఉండదని, కూల్చివేయాలని నివేదిక ఇచ్చారు. దాని ఆధారంగా ఈ సత్రాన్ని కూల్చివేసి, కొత్త సత్రం నిర్మాణానికి గతంలో కాంట్రాక్ట్ పొందిన సంస్థను కోరారు. కార్తిక మాసంలోనే ఈ సత్రాన్ని కూల్చివేయాలని అనుకున్నా.. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో వాయిదా వేశారు. ప్రస్తుతం రద్దీ తక్కువగా ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకుని సత్రాన్ని కూల్చివేస్తున్నారు.
18 నెలల్లో పూర్తి చేస్తాం
దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు సీతారామ సత్రం కూల్చివేత పనులు దేవస్థానం ఈఈ వి.రామకృష్ణ పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఈ నెలాఖరుకల్లా కూల్చివేత పూర్తవుతుంది. అనంతరం మంచి ముహూర్తంలో నూతన సత్రం నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుంది. అనంతరం, మూడంతస్తుల్లో 105 గదులతో నూతన సత్రం నిర్మిస్తాం. దీనిని 18 నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించాం.
– వి.త్రినాథరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం
నూతన సత్రం నిర్మాణానికి అడుగులు


