ధాన్యం కొనుగోడులు!
● కొనుగోలు కేంద్రాలపై
ప్రకటనలకే పరిమితమైన అధికారులు
● విక్రయాలు మొదలుపెట్టేసిన దళారులు
● ఇప్పటికే 50 వేల టన్నులు విక్రయం
పిఠాపురం: ప్రస్తుతం గోదావరి డెల్టా, ఏలేరు పరిధిలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. కోతలు జోరుగా సాగుతుండగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాక ప్రైవేటు వ్యాపారులదే హవాగా మారింది. దీంతో ఒక పక్క దిగుబడులు ఆశించిన స్థాయిలో లేక మద్దతు ధర రాక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటిలాగే ప్రభుత్వం హడావుడి చేస్తోంది. ఇదిగో కొనుగోలు కేంద్రాలు అంటూ సమావేశాలు, సమీక్షలు, అవగాహనలంటూ హంగామా చేస్తోంది. ఒక్క గింజ కూడా వదల కుండా కొనుగోలు చేస్తామన్న ప్రకటనలు తప్ప ఇప్పటికీ ఒక్క గింజ కూడా కొనలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఒక పక్క జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా జరుగుతుండగా ధాన్యం విక్రయాలు అదే స్థాయిలో ప్రైవేటు వ్యాపారులకు చేస్తున్నారు. ప్రతి రోజు వందల టన్నుల ధాన్యం మిల్లులకు చేరుతోంది. యంత్రాల ద్వారా కోతలు చేపట్టడంతో ఆ వెంటనే ధాన్యం విక్రయాలు జరిగిపోతున్నాయి. కాని ప్రభుత్వం మాత్రం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 70 శాతానికి పైగా వరిపంట కోతకు సిద్ధం కాగా పలు చోట్ల వరి కోతలు ప్రారంభించారు.
ప్రైవేటు వ్యాపారులదే హవా
జిల్లాలో వరికోతలు నూర్పులు ముమ్మరంగా చేపట్టనున్న నేపథ్యంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల వరి కోతలు ప్రారంభం కావడంతో ప్రైవేటు వ్యాపారులు ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించేశారు. యంత్రాలతో కోసిన ధాన్యాన్ని కళ్లాల్లోనే కొనుగోలు చేసి మిల్లులకు తరలిస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేక పోవడం వల్లే తాము ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ప్రైవేటు వ్యాపారులు ఇచ్చిన ధరనే తీసుకోవాలి తప్ప మద్దతు ధర వచ్చే అవకాశం లేక ఆదాయం బాగా పడిపోతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఽవరి కోతలు ప్రారంభం నాటికి ధాన్యం కొనుగోలు కేంద్రాలు సిద్ధం చేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేక ప్రైవేటు వ్యాపారులు సిండికేట్‌గా మారారు. తాము చెప్పిందే ధర అన్నట్టుగా రైతులను దోచుకుంటున్నారు. వేరే దారి లేక వారు అడిగినంత ధరకు అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. రబీ సీజన్‌లో ప్రైవేటు వ్యాపారులు రైతులను నట్టేముంచుతున్నా అడిగే నాధుడు కనిపించడం లేదు.
ఆ నిబంధనలే శాపాలు
ప్రభుత్వం ఒక వేళ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా ముందు మేము రైతు సేవా కేంద్రానికి వెళ్లి సమాచారం ఇచ్చి కూపన్ తీసుకోవాలి. తరువాత సిబ్బంది వారికి వీలు కుదిరనప్పుడు వచ్చి నమూనాలు తీసుకువెళ్తారు. తేమ ఎక్కువైతే ఆరబెట్టి తెండి అంటారు. ఇంతలో ఏ వర్షమైనా వస్తే అవి కాస్తా తడిసిపోయి నష్టమే మిగులుతుంది. ముఖ్యంగా పచ్చి ధాన్యాన్ని ప్రభుత్వం కొనదు. దీని వల్ల ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. దీంతో వ్యాపారులు వారి ఇష్టానుసారం ధర నిర్ణయించి కొంటున్నారు. మాకు నష్టాలు తప్పడం లేదు. ఆరబెట్టి అమ్ముదామని కళ్లాల్లో ఉంచిన ధాన్యం రోజుల క్రితం వచ్చిన వానకు తడిసి పోయాయి.
– గంధం కృష్ణ,
రైతు, కొత్తపల్లి
నష్టం వచ్చినా తప్పడం లేదు
రోజురోజుకు ధాన్యం ధరలు తగ్గించేస్తున్నారు. ఎందుకని అడిగే వారు లేరు ఎవరికి వారే ధాన్యం అమ్ముడైతే చాలన్నట్టు వ్యవహరిస్తున్నారు. కోత కోయక ముందు రూ.1450 అన్నారు. తీరా కోసాకా పచ్చి ధాన్యం అంటూ రూ.1200 అంటున్నారు. కనీసం ఎకరానికి రూ.8 వేల నుంచి రూ.10 వేల నష్టం తప్పడం లేదు. ప్రస్తుతం అంతా యంత్రాలతో కోతలు కోస్తుండడం వల్ల అంతా పచ్చి ధాన్యమే ఉంటుంది. ప్రైవేటు వ్యాపారులు పచ్చి ధాన్యం ఎలా ఉన్నది అలా కొంటున్నారు. అందుకే వారు అడిగిన ధరకు విక్రయించాల్సి వస్తోంది. అదే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అయితే ధాన్యం ఎండబెట్టి పూర్తిగా ఆరాకా ఎగరబోసి ఏ విధమైన తుక్కు లేకుండా చేసి అమ్మితేనే కొంటారు. అందుకే ధర లేక పోయినా ప్రైవేటు వ్యాపారులకే విక్రయిస్తున్నాం.
– కరణం శ్రీను,
రైతు
కొనుగోలు కేంద్రాలఏర్పాటుకు చర్యలు
జిల్లాలో ఇప్పుడిప్పుడే వరి కోతలు ప్రారంభించారు. పూర్తి స్థాయిలో కోతలు ప్రారంభమయ్యే లోపు అన్ని మండలాల్లోను కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాము. ఆయా ప్రాంతాల్లో తొలుత కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. ఇప్పటికే అన్ని రైతు సేవా కేంద్రాలలోను ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాం. ఈ విషయం రైతులకు తెలియక ప్రైవేటు వ్యాపారులకు అమ్ముతున్నారు. రైతులకు తెలిసేలా ప్రచారం చేయడానికి చర్యలు తీసుకుంటాం.
– స్వాతి,
ఏడీఏ,
పిఠాపురం వ్యవసాయ శాఖ
జిల్లాలో వరి సాగు వివరాలు
ఖరీఫ్ సాగు భూములు – 1,58,120 ఎకరాలు
సాగు చేసిన రైతులు – 1.45 లక్షల మంది
ఏటా ధాన్యం దిగుబడి – 5.70 లక్షల టన్నులు
వారం రోజులుగా విక్రయించిన ధాన్యం – సుమారు 50 వేల టన్నులు
ప్రతి రోజు – 1500 నుంచి 2000 టన్నుల ధాన్యం విక్రయం
ధాన్యం కొనుగోడులు!
ధాన్యం కొనుగోడులు!
ధాన్యం కొనుగోడులు!


