10 నుంచి టెట్
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్ (టెట్) ఈ నెల 10న ప్రారంభం కానుంది. జిల్లాలోని సూరంపాలెం ఆదిత్య కళాశాలలో 3, కాకినాడ అచ్యుతాపురం, రాయుడుపాలెం కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలు ఈ నెల 21తో ముగుస్తాయి. జిల్లావ్యాప్తంగా 9,600 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఒక సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మరో సెషన్‌లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థులు హాల్ టికెట్లతో పాటు ఏదో ఒక ఒరిజనల్ గుర్తింపు కార్డు తప్పకుండా తీసుకుని వెళ్లాలి. ఆన్‌లైన్‌లో జరిగే ఈ పరీక్షకు అరగంట ముందే ఆయా కేంద్రాలకు చేరుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. దివ్యాంగ అభ్యర్థులకు 50 నిమిషాలు అదనపు సమయం ఇస్తారు.
ఆన్‌లైన్‌లో మాక్ టెస్ట్
దరఖాస్తుదారులకు ఆన్‌లైన్ పరీక్షపై అవగాహన కల్పించేందుకు గత నెల 25 నుంచి ఆన్‌లైన్‌లో మాక్ టెస్ట్ అందుబాటులో ఉంచారు. సీఎస్‌ఈ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్ ద్వారా ఈ మాక్ టెస్ట్‌లో పాల్గొనవచ్చు. హాల్ టికెట్లను కూడా ఇదే వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. టెట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్ తెలిపారు.
అంబేడ్కర్ సేవలు స్ఫూర్తిదాయకం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): దేశానికి బాబా సాహెబ్ బీఆర్ అంబేడ్కర్ అందించిన దృఢమైన రాజ్యాంగం, ఆయన సేవలు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అన్నారు. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ఇంద్రపాలెం సెంటర్ వద్ద ఉన్న ఆ మహనీయుని విగ్రహానికి కలెక్టర్‌తో పాటు పలువురు అధికారులు శనివారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో విశ్రాంత డీఎంఈ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ బాబ్జీ ఏర్పాటు చేసిన జైభీమ్ ఆర్కెస్ట్రా బృందం అంబేడ్కర్ జీవిత విశేషాలతో చేసిన గీతాలాపన అందరినీ అలరించింది. కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ, చదువుకోవడానికి ఏమాత్రం అవకాశం లేని పరిస్థితుల నుంచి అత్యున్నత స్థాయికి చేరిన ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.
రద్దీగా సత్యదేవుని సన్నిధి
అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని సన్నిధి వేలాదిగా వచ్చిన భక్తులతో శనివారం రద్దీగా మారింది. సుమారు 25 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. వ్రతాలు 1,500 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా రూ.25 లక్షల ఆదాయం సమకూరింది. 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయ ప్రాకారంలో స్వామి, అమ్మవార్లకు తిరుచ్చి వాహనంపై ప్రాకార సేవ నిర్వహించారు.


