అదుపుతప్పిన వ్యాన్
రాంగ్ రూట్‌లో వెళ్లి లారీని ఢీకొన్న వైనం
గండేపల్లి: వాహన రాకపోకలతో రద్దీగా ఉండే హైవేపై ఐషర్ మినీ వ్యాన్ హడలెత్తించింది. ఒక్కసారిగా రాంగ్ రూట్లోకి వేగంగా వెళ్లి ప్రమాదానికి కారణమైంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్నం వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళుతున్న ఐషర్ వ్యాన్ గండేపల్లికి వచ్చేసరికి డివైడర్ వద్ద రాంగ్ రూట్లోకి మారిపోయి వేగంగా ప్రయాణిస్తూ లారీని ఢీకొంది. ఈ సంఘటనలో లారీ, ఐషర్ క్యాబిన్లు ఇరుక్కుపోవడంతో హైవే క్రేన్ సహాయంతో బయటకు తీశారు. ఈ ప్రమాదంలో ఐషర్ వ్యాన్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్ ఎండీ హపీజ్, క్లీనర్ నిమైలను బయటకు తీయించి చికిత్స నిమిత్తం హైవే అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన వ్యాన్‌కు బ్రేక్‌లు ఫెయిల్ అయినట్టు డ్రైవర్ చెబుతుండగా, డ్రైవర్ మద్యం తాగి ఉన్నాడా అనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేశారు. ముందుగా ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ లారీని రోడ్డుపై నిలిపివేయడంతో ప్రాణనష్టం తప్పింది.
రేపు బాలుర
జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక
అంబాజీపేట: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా అండర్–17 బాలుర క్రికెట్ జట్టును అంబాజీపేట జెడ్పీ హైస్కూల్‌లో ఆదివారం ఎంపిక చేయనున్నట్లు డీఈఓ షేక్ సలీం బాషా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ క్రీడలో పాల్గొనే విద్యార్థులు ఉదయం 9 గంటల్లోపు స్థానిక హైస్కూల్‌కు చేరుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు ఎస్‌జీఎఫ్ కార్యదర్శులు కొండేపూడి ఈశ్వరరావు– 93469 20718, ఎఎస్‌ఎస్ రమాదేవి 94400 94984 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు.


