సేవే సత్యవ్రతమై..
● సత్యదేవుని సేవలో ఎందరో మమేకం
● భక్తుల సేవలో కొందరు.. వాహనాలు..
● ఆలయ అవసరాలు తీరుస్తూ
ఇంకొందరు
అన్నవరం: దైవం మానుష రూపేణా అంటారు. ఆయన అనుమతి లేకుండా పరమాత్ముని దర్శించలేమని కూడా పెద్దలు అంటుంటారు. అందుకు మార్గాన్నీ.. ఆ ప్రయత్నంలో భక్తులు అలసి సొలసిపోకుండా, ఎటువంటి అవాంతరాలు తలెత్తకుండా అనుక్షణం విభిన్న రూపాలలో వారికి సాయపడుతూ తన దర్శనభాగ్యం కల్పిస్తున్నాడు. భక్తజన సేవే మాధవ సేవగా వారికి తోడునీడగా నడుస్తున్నవారెందరో..
కార్తికమాసంలో సత్యదేవుని సన్నిధికి వచ్చే లక్షలాది భక్తులకు ఎందరో స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు. మానవసేవే మాధవ సేవగా భావించి ప్రతిఫలాపేక్ష లేకుండా పని చేసుకుపోతున్నారు. ఆలయానికి నిత్యం వచ్చే భక్తులకే కాకుండా ఈ నెల రెండో తేదీన జరిగిన స్వామివారి తెప్పోత్సవం, ఐదో తేదీన జరిగిన గిరిప్రదక్షిణల విజయవంతం కావడంలో ఆలయ సిబ్బందితో పాటు వీరి సేవా ఎంతో కీలకంగా నిలిచాయి.
భక్తుల సేవకు విద్యాసంస్థల బస్సులు : కార్తికమాసంలో భక్తులకు సేవలందించేందుకు పలు విద్యాసంస్థలు సైతం ముందుకు వచ్చి తమ వంతు సాయం చేస్తున్నా యి. భక్తుల రద్దీ అధికంగా ఉండే శని, ఆది, సోమవారాలలో, పర్వదినాలలో అన్నవరం రైల్వేస్టేషన్ నుంచి రత్నగిరికి, అక్కడి నుంచి సత్యగిరికి విద్యాసంస్థలు 15 బస్సులు అందించాయి. పాయకరావుపేటకు చెందిన శ్రీప్రకాష్ విద్యాసంస్థలు ఎనిమిది, తిరుమల విద్యాసంస్థలు నాలుగు, అరబిందో సంస్థ రెండు, కాకినాడకు చెందిన దాత వాసిరెడ్డి ఏసుదాసు ఒక బస్సు అందచేసినట్టు ఆలయ ఈఈ వి.రామకృష్ణ తెలిపారు. ఇదే కోవలో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు బస్సులు, రెండు బ్యాటరీ కార్లు విరాళంగా సమర్పించారు. అలాగే విశాఖపట్నానికి చెందిన లారస్ ఫార్మా కంపెనీ రూ.2.5 కోట్ల వ్యయంతో పశ్చిమ రాజగోపురానికి ఎదురుగా విశ్రాంతి షెడ్డు నిర్మించింది. ఇక సత్య దేవుని హుండీ లెక్కింపులో విశాఖకే చెందిన శ్రీహరి సేవ, శ్రీవారి సేవా సభ్యులు 400 మంది చాలా కాలంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీంతో హుండీ లెక్కింపు అత్యంత వేగంగా మధ్యాహ్నం ఒంటిగంటకే పూర్తయిపోతోంది. అలాగే గిరి ప్రదక్షణలో లక్షలాది మంది భక్తులకు తాగునీరు, పాలు, పళ్లు, ఫలహారాల పంపిణీలో దాతల సేవ ప్రశంసనీయం. ప్రత్యక్షంగా కనపడేవారు వీరైతే.. పరోక్షంగా దేవుని సేవలో నిమగ్నమైన మహానుభావులెందరో.
మహిళా సేవకులే అధికం..
ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో మహిళలు రత్నగిరిపై స్వచ్ఛంద సేవలు అందిస్తున్నారు. క్యూ లైన్లలో భక్తులకు తాగునీటి సరఫరా, సర్క్యులర్ మండపం వద్ద పులిహోర పంపిణీ, తులసి కొమ్మల నుంచి పత్రి వేరు చేయడం, వ్రతాలకు సామగ్రి సిద్ధం చేయడం, స్వామివారి ఆలయం, యంత్రాలయం, వ్రత మండపాలు, గోకులం, రావిచెట్టు తదితర చోట్ల భక్తులను నియంత్రించడం వంటి సేవలు చేస్తున్నారు. నాలుగు గంటలకు ఒక బ్యాచ్ చొప్పున నాలుగు షిప్టులలో వీరికి సేవలు కేటాయిస్తున్నారు.
సేవే సత్యవ్రతమై..


