రత్నగిరి కిటకిట
అన్నవరం: కార్తికమాసం మూడో శనివారం సందర్భంగా సత్యదేవుని దర్శనానికి రికార్డు స్థాయిలో సుమారు 70 వేల మంది భక్తులు వచ్చినట్టు అధికారులు అంచనా వేశారు. వీరి రాకతో అన్నవరం మెయిన్ రోడ్డు, రైల్వేస్టేషన్ రోడ్లలో పలుమార్లు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కాగా స్వామివారి వ్రతాలు 7,900 జరగడంతో వ్రతమండపాలు, క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. కాగా స్వామివారి ఆలయాన్ని శనివారం వేకువజామున ఒంటిగంటకు తెరిచి పూజల అనంతరం రెండు గంటల నుంచి భక్తులకు దర్శనాలు, వ్రతాలు ప్రారంభించారు. అంతరాలయం టికెట్ తీసుకున్నవారికి సైతం బయట నుంచే దర్శనాలు కల్పించారు.
రూ.80 లక్షల ఆదాయం
శనివారం భక్తుల ద్వారా దేవస్థానానికి రూ.80 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. వ్రతాల ద్వారా సుమారు రూ.40 లక్షలు, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.30 లక్షలు, ఇతర విభాగాల ద్వారా రూ.పది లక్షలు వచ్చింది. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ ఏర్పాట్లు పర్యవేక్షించారు.
ప్రొఫెసర్ వేధింపులపై ఆందోళన
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం అల్లురామలింగయ్య ప్రభుత్వ హోమియో వైద్య కళాశాలలో ప్రొఫెసర్ల వేధింపులు అధికమయ్యాయి. వీటిని తట్టుకోలేని వైద్య విద్యార్థులు శనివారం రోడ్డెక్కారు. తాము కళాశాలలో జరిగే ప్రాక్టికల్స్‌కు హాజరుకాలేమని, వేధింపులకు గురిచేస్తున్న ప్రొఫెసర్లను తొలగించకపోతే తాము ఇక్కడ విద్యను అభ్యసించలేమని చెబుతున్నారు. ఇక్కడ పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న గాయత్రి అనే విద్యార్థిని ప్రొఫెసర్ మంజుల వేధింపులకు తాళలేక ఆసుపత్రి పాలైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు హోమియో కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. తాను వేరే ప్రొఫెసర్ స్టూడెంట్‌ని కావడం వల్లే మంజుల తనను వేధిస్తున్నారని గాయత్రి తెలిపింది. భోజన సమయంలో పంపకపోవడం, సాయంత్రం 4 గంటలకు కళాశాల అయిపోయినా 5.30 వరకు పంపకపోవడం చేస్తున్నారని పేర్కొంది. ఇదిలావుండగా కళాశాల ప్రాంగణంలో అందరి మధ్య దూషిస్తూ, బెదిరించడంతో గాయత్రి మనస్తాపం చెంది రెండు రోజులుగా ఆహారం మానేసింది. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే ఆమె స్నేహితులు గాయత్రిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఆమె కోలుకున్న అనంతరం కళాశాల వద్దకు వచ్చి ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని, వేధింపులకు గురిచేస్తున్న ప్రొఫెసర్ మంజులను తొలగించాలని డిమాండ్ చేశారు. తాను ఎవరినీ వేధించలేదని, గాయత్రిని క్లాస్ చూడమని చెబితే తాను వేరే క్లాస్‌కు వెళ్లిందని, ఈ విషయం మీద పేపర్‌పై రాసి ఇమ్మని అడిగానని మంజుల వివరించారు. కాగా ఈ ప్రొఫెసర్ గతంలోను పలు వివాదాలకు కారకురాలయ్యారని, కళాశాలలో వేరే ప్రొఫెసర్‌పై ఆమె పోలీసు కేసులు కూడా పెట్టారని చెప్తున్నారు. ఇద్దరు హెచ్‌వోడీల మధ్య వైరుధ్యాల నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని కళాశాల వర్గాలు చెప్తున్నాయి.


