స్వాతంత్య్ర స్ఫూర్తి వందేమాతరం
జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి
పిఠాపురం: వందేమాతరం గేయం భారతీయుల్లో స్వాతంత్య్ర కాంక్షను రగిలించిందని, ఈ గేయం స్ఫూర్తితో ఎందరో మహనీయులు స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నారని కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. వందేమాతరం గేయం నేటితో 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం పిఠాపురం ఆర్‌ఆర్బీహెచ్‌ఆర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఆయన వందేమాతరం గేయాన్ని ఆలపించారు. అనంతరం అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమం కింద జిల్లా సీ్త్ర, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలలకు ఒక్కరోజు క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమానికి సంబంధించిన బస్సును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ 1875 సంవత్సరం నవంబర్ 7న బెంగాలీ కవి బంకించంద్ర ఛటర్జీ ఆనందమఠ్ అనే నవల నుంచి ఈ వందేమాతరం గేయాన్ని రచించడం జరిగిందన్నారు. అనతి కాలంలోనే ఈ గేయం భారతీయుల్లో స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించిందన్నారు. నేటి యువత ఈ గీతాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీఎస్‌ఎన్ వర్మ, పెండెం దొరబాబు, కాకినాడ ఆర్డీవో ఎస్ మల్లి బాబు, పాడా ఏపీడీ వసంత మాధవి, జిల్లా బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ బి.దుర్గారాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


