క్లస్టర్‌ వ్యవస్థకు మంగళం! | - | Sakshi
Sakshi News home page

క్లస్టర్‌ వ్యవస్థకు మంగళం!

Nov 7 2025 6:56 AM | Updated on Nov 7 2025 6:56 AM

క్లస్టర్‌ వ్యవస్థకు మంగళం!

క్లస్టర్‌ వ్యవస్థకు మంగళం!

ఇక గ్రామ పంచాయతీలకు

స్వయం ప్రతిపత్తి హోదా

నాలుగు గ్రేడ్లుగా విభజన

కార్యదర్శి పదవి పంచాయతీ

అభివృద్ధి అధికారిగా మార్పు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి

వచ్చినప్పటి నుంచి ఇదే పంథా

అన్ని విభాగాలను నిర్వీర్యం చేసే కుట్ర

సాక్షి, రాజమహేంద్రవరం: గ్రామ పంచాయతీల్లో క్లస్టర్‌ వ్యవస్థకు కూటమి సర్కారు మంగళం పాడింది. వాటి స్థానంలో పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పరిణామం పంచాయతీ పాలన వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తుందని ప్రభుత్వం వెల్లడిస్తోంది. మున్సిపల్‌ పాలన తరహాలో గ్రామ పరిపాలన సాగునుందన్న అభిప్రాయం వెల్లడవుతోంది. ఇదిలా ఉంటే సాఫీగా నడుస్తున్న వ్యవస్థలను గందరగోళానికి గురి చేయడం తగదన్న వాదన వినిపిస్తోంది. సంస్కరణల పేరుతో ఇప్పటికే గ్రామ పంచాయతీలు, ఆర్బీకేలను ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. విద్యాశాఖలో సైతం ఇదే తరహా వ్యవహారానికి తెర తీసింది. దీనికితోడు ఏళ్ల తరబడి ఉన్న పంచాయతీరాజ్‌ వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఉద్యోగులకు లాభం చేకూరుస్తున్నామన్న నెపంతో క్లస్టర్‌ వ్యవస్థలో నిర్వహించే విధులే నూతన విధానంలో సైతం ఉండనున్నాయి. పని అదే అయినా.. కూటమి మార్క్‌ చూపించుకోవాలన్న ప్రయత్నంలో భాగంగానే ఈ మార్పులు చేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఉమ్మడి ‘తూర్పు’లో ఇలా..

కూటమి ప్రభుత్వం సరికొత్త విధానానికి నాంది పలికింది. ప్రస్తుతం అమలులో ఉన్న పంచాయతీ క్లస్టర్‌ వ్యవస్థను రద్దు చేసి, రాష్ట్రవ్యాప్తంగా 19,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా ప్రకటించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా 60 మండలాలు ఉండగా.. 76 పంచాయతీలను స్పెషల్‌ గేడ్ర్‌ పంచాయతీలుగా విభజించారు.

విభజన ఈ విధంగా..

పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా విభజించారు. పంచాయతీ కార్యదర్శుల పేరును ‘పంచాయతీ అభివృద్ధి అధికారి (పీడీఓ)గా మార్చారు. ప్రతి పంచాయతీలో ప్రధానంగా పారిశుధ్యం, తాగునీటి సరఫరా, గ్రామీణ ప్రణాళిక, వీధి దీపాల నిర్వహణ, ఇంజినీరింగ్‌, ఆదాయం– పన్ను వసూళ్లు విభాగాలు ఉండనున్నాయి.

సిబ్బంది మార్పులు

కొత్తగా ఏర్పడే రూర్బన్‌ పంచాయతీల్లో జూనియర్‌ అసిస్టెంట్లు, బిల్‌ కలెక్టర్లను సీనియర్‌ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్‌ చేస్తారు. డిజిటల్‌ అసిస్టెంట్లతో ప్రత్యేక ఐటీ విభాగం ఏర్పాటు చేస్తారు. కార్యదర్శుల ఖాళీలను 2025–26 ప్యానెల్‌కు ముందే భర్తీ చేయాలని నిర్ణయించారు.

స్పెషల్‌ గ్రేడ్‌ పంచాయతీ అంటే..

ఆ గ్రామ పంచాయతీలో పది వేలకు పైగా జనాభా కలిగి ఉండి, రూ.కోటికి పైగా ఆదాయం ఉన్న పంచాయతీలను స్పెషల్‌ గ్రేడ్‌ పంచాయతీగా పరిగణిస్తారు. గిరిజన ప్రాంతాల్లో ఐదు వేలకు పైగా జనాభా ఉంటే సరిపోతుంది. ఇప్పటి వరకు కొనసాగుతున్న గ్రేడ్‌–1 కార్యదర్శి స్థాయిని పెంచుతూ డిప్యూటీ ఎంపీడీఓగా నియమిస్తారు.

గ్రేడ్‌–1 పంచాయతీ

పంచాయతీలో 4,000 నుంచి 10,000లోపు జనాభా.. రూ.30,000 నుంచి రూ.కోటి లోపు ఆదాయం ఉన్న పంచాయతీలను గ్రేడ్‌–1 పంచాయతీలుగా పరిగణిస్తారు. గిరిజన ప్రాంతాల్లో 3 నుంచి 5 వేల లోపు జనాభా ఉంటే సరిపోతుంది. మండల కేంద్రంలోని అన్ని పంచాయతీలను గ్రేడ్‌–1 పరిధిలోకి తీసుకువస్తున్నారు.

గ్రేడ్‌–2 పంచాయతీ

గ్రామ పంచాయతీలో 2 వేల నుంచి 4 వేల మధ్య జనాభా ఉండాలి. గిరిజన ప్రాంతాల్లో 1,500 నుంచి 3,000 లోపు ఉంటే సరిపోతుంది.

గ్రేడ్‌–3 పంచాయతీ

జనాభా 2,000 లోపు, గిరిజన ప్రాంతాల్లో 1,500లో ఉన్న పంచాయతీలు ఈ కోవలోకి వస్తాయి. ఇదే సందర్భంలో పంచాయతీ కార్యదర్శిని గ్రేడ్ల వారీగా ఎగ్గిక్యూటివ్‌ అధికారి (ఈఓ)గా పిలుస్తారు. నూతన వర్గీకరణలో క్లర్కులు, బిల్‌ కలెక్టర్లు, అటెండర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, పారిశుధ్య కార్మికులు, రాత్రి కాపలా దారులు, ఎలక్ట్రీషియన్‌లు అదనంగా రానున్నారు.

అర్బన్‌ పంచాయతీలు రూర్బన్‌గా విభజన

అర్బన్‌ ప్రాంతాల్లో ఉన్న పంచాయతీలను రూర్బన్‌గా విభిజించి ప్రత్యేక హోదా కల్పించనున్నారు.

సెక్రటరీగా ఉండటమే ఉత్తమం

పంచాయతీ వ్యవస్థ పురాతనమైనది. పంచాయతీ అధికారికి సెక్రటరీగా గౌరవం, గుర్తింపు ఉంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ పోస్టుకు పంచాయతీ అభివృద్ధి అధికారి (పీడీఓ)గా నామకరణం చేయడం ఎంతవరకు సమంజసమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి నిర్ణయం 73వ రాజ్యాంగ సవరణకు భిన్నంగా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

వసూళ్లపై దృష్టి పెట్టేందుకేనా?

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆదాయ మార్గాల అన్వేషణ ప్రారంభించింది. ఇందులో భాగంగా పంచాయతీల్లో పన్నుల వసూళ్లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు ఉన్న క్లస్టర్‌ వ్యవస్థలో రెండు పంచాయతీలకు కలిపి ఒక సెక్రటరీ ఉండటంతో వసూళ్లు మందగిస్తున్నాయి. ఒక్కో పంచాయతీని విడదీసి ప్రత్యేక హోదా ఇస్తే.. వసూళ్లు బాగుంటాయన్న భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కూటమి మార్క్‌కు తహ తహ

ఇప్పటి వరకు పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఐదు గ్రేడ్లుగా ఉండేవి. సచివాలయ ఉద్యోగులు ఆరో గ్రేడ్‌గా ఉండగా వాటిని ప్రస్తుతం మూడు గ్రేడ్లుగా మార్పు చేస్తున్నారు. ఇది ఉద్యోగులకు కొంత ఊరట కలిగించనుంది. అయితే ఉద్యోగులకు లాభం కల్పిస్తున్నామని చెబుతూ కూటమి సర్కారు పాత విధానానికి కొత్త తరహా కలరింగ్‌ ఇస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు పంచాయతీల్లో అభివృద్ధి పనులు, పారిశుధ్యం, ఇతర నిర్వహణ పనులు పంచాయతీ సెక్రటరీల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. కొత్తగా సైతం పేరు మార్చి వారికే ఆ బాధ్యతలు అప్పగించారు. కేవలం కూటమి సర్కారు తన మార్క్‌ చూపించుకునేందుకు పడుతున్న పాట్లలో భాగంగానే ఈ మార్పులు చేస్తోందన్న భావన ప్రజల్లో కలుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement