సత్యదేవుని హుండీ ఆదాయం రూ.1.73 కోట్లు
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణస్వామికి హుండీల ద్వారా రూ.1.73 కోట్లు సమకూరింది. దేవస్థానంలో హుండీలను శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు తెరిచి ఆదాయాన్ని లెక్కించగా మధ్యాహ్నం 12 గంటలకు పూర్తయ్యింది. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు, ఇతర సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 30 రోజులకు ఈ ఆదాయం సమకూరినట్టు ఆలయ అధికారులు తెలిపారు. హుండీల ఆదాయంలో 1,62,76,244 నగదు, 10,61,567 చిల్లర నాణేలతో పాటు 37 గ్రాముల బంగారం, 800 గ్రాముల వెండి, 41 అమెరికా డాలర్లు, పది ఇంగ్లాండ్ పౌండ్లు, రెండు సింగపూర్ డాలర్లు, ఐదు సౌదీ సెంట్రల్ బ్యాంక్ రియల్స్, 25 బూటాన్ కరెన్సీ, రెండు వేల కాంగోలీస్ ప్రాంక్, రెండు మలేషియా రింగిట్స్ రెండు, 20 స్కాట్‌లాండ్ పౌండ్లు, ఒక కువైట్ దీనార్ ఉన్నాయి. ప్రతి ఏడాదీ కార్తిక మాసంలో తొలి విడతగా పౌర్ణమి తర్వాత, రెండో విడతగా కార్తికమాసం ముగిశాక హుండీల ఆదాయం లెక్కించడం ఆనవాయితీ. ఆ ప్రకారమే తొలివిడతగా స్వామివారి హుండీల ఆదాయాన్ని లెక్కించారు. గత 30 రోజుల్లో రోజుకు సరాసరి 5,77,927 చొప్పున సమకూరింది. మోంథా తుపాన్ కారణంగా గత నెల 27 నుంచి 31 వరకూ ఐదు రోజుల పాటు సత్యదేవుని ఆలయానికి భక్తులు రాలేదు. దీంతో ఆదాయం తగ్గినట్టు అధికారులు భావిస్తున్నారు.
సత్యదేవుని దర్శించిన 40 వేల మంది
రత్నగిరి కొలువైన సత్యదేవున్ని సుమారు 40 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వారితో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయం ప్రాంగణం కిటకిటలాడింది. సత్యదేవుని వ్రతాలు 2,500 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం వచ్చినట్టు అధికారులు తెలిపారు. స్వామి వారి ఆలయాన్ని తెల్లవారుజాము మూడు గంటలకు తెరిచి పూజలు చేశారు. వ్రతాలు కూడా ఆ సమయం నుంచే ప్రారంభించారు. స్వామివారిని దర్శించిన భక్తులు సప్త గోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. తూర్పురాజగోపురం ఎదురుగా గల రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి పూజలు చేశారు.
నేటి నుంచి మూడు రోజులు రద్దీ
అన్నవరం దేవస్థానానికి శని, ఆది, సోమవారాల్లో (8, 9, 10 తేదీలు) భక్తులు పెద్దసంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ మూడు రోజులూ అర్ధరాత్రి దాటక ఒంటి గంట నుంచే సత్యదేవుని వ్రతాలు ప్రారంభిస్తారు. రెండు గంటల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. ఈ మూడు రోజులు వసతి గదులను భక్తులందరికీ ఇవ్వలేమని, గమనించాలని ఈఓ వీర్ల సుబ్బారావు కోరారు.
సత్యదేవుని హుండీ ఆదాయం రూ.1.73 కోట్లు


