వైద్యుడు అందుబాటులో లేక వ్యక్తి మృతి! | - | Sakshi
Sakshi News home page

వైద్యుడు అందుబాటులో లేక వ్యక్తి మృతి!

Nov 8 2025 7:24 AM | Updated on Nov 8 2025 7:24 AM

వైద్యుడు అందుబాటులో లేక వ్యక్తి మృతి!

వైద్యుడు అందుబాటులో లేక వ్యక్తి మృతి!

సామర్లకోట: స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్సకు వచ్చిన వ్యక్తి మృతి చెందాడు. డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్‌ అందుబాటులో లేకపోవడంతో ఈ ఘోరం జరిగిందనే ఆరోపిస్తున్నారు. స్థానికులు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఉబా జాన్‌ మోజెస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పువారి వీధికి చెందిన మలిరెడ్డి భూలోకం (56) గ్యాస్‌ నెప్పితో శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో సామాజిక ఆరోగ్య కేంద్రానికి వచ్చాడు. ఆ సమయంలో డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్‌ లేరు. దీంతో ట్రైనీ డాక్టర్‌ ఆ రోగి పరిస్థితిని డాక్టర్‌కు వాట్సాప్‌లో తెలియజేశారు. కానీ వైద్యం అందే లోపు భూలోకం మృతి చెందాడు. కాగా.. డాక్టర్‌ నిర్లక్ష్యం కారణంగానే భూలోకం మృతి చెందారని మోజెస్‌ అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్‌.. ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయడం జరుగుతోందని ఆరోపించారు. విషయం తెలుసుకొని సీఐ ఎ. కృష్ణభగవాన్‌ ఆధ్వర్యంలో ఎస్సై మూర్తి ఆస్పత్రికి వచ్చి వివరాలు సేకరించారు. మృతుని కుటుంబ సభ్యుడు, వైస్‌ చైర్మన్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వ్యక్తి పీక కోసి పరారీ

కొత్తపల్లి: పొన్నాడ శివారు కోనపాపపేటకు చెందిన సోదే జాన్‌ గురువారం రాత్రి స్ధానిక ఎన్‌ఎస్‌ఆర్‌ హేచరీకి సమీపంలోని తీరంలో ఉన్న రేకుల షెడ్డులో బల్లపై నిద్రిస్తున్నాడు. సుమారు 10.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి జాన్‌ పీక కోసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతడిని బంధువులు పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు ఎస్సై వెంకటేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్‌

గండేపల్లి: గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్‌ చేసి, వారి నుంచి రూ. 3,73,500 విలువైన కారు, మూడు సెల్‌ ఫోన్లు, 2 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్‌ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లాకు చెందిన తాకు నరసింహసింగ్‌, పున్నాన తేజ, మహిందర్‌ సింగ్‌లు 21.7 కేజీల గంజాయిని 11 ప్యాకెట్లలో ప్యాక్‌ చేసి కారులో తరలిస్తున్నారు. గండేపల్లి మండలం ఎన్టీ రాజాపురం రోడ్డులో శుక్రవారం వాహనాలను తనిఖీ చేస్తున్న ఎస్సై యూవీ శివ నాగబాబు, సిబ్బంది వీరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పెద్దాపురం కోర్టుకు తరలించగా న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు. కాగా.. నరసింహసింగ్‌పై 4, తేజ పై 8, మహిందర్‌ సింగ్‌పై 3 దొంగతనం కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అలాగే మరో 13 మందికి దీనిలో ప్రమేయం ఉందని, వారిపై తొందరలోనే చర్యలు తీసుకుంటామన్నారు.

07పీటీపీ57:

సామాజిక ఆరోగ్య కేంద్రంలో మృతి చెందిన భూలోకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement