రత్నగిరికి పోటెత్తిన భక్తులు
అన్నవరం: రత్నగిరి సత్యదేవుని ఆలయం గురువారం వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కిటకిట లాడింది. ఉదయం నుంచి భక్తులు సత్యదేవుని సన్నిధికి తరలివచ్చారు. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించగావ్రతాలు 2,500 జరిగాయని అధికారులు తెలిపారు. నిత్య కల్యాణంలో రూ.1,116 చొప్పున టిక్కెట్లు కొనుగోలు చేసి 20 మంది భక్తులు పాల్గొన్నారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. సుమారు ఆరు వేల మంది భక్తులకు పులిహోర, దద్దోజనం పంపిణీ చేశారు. కాగా కార్తికమాసంలో తొలివిడతగా సత్యదేవుని హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కించనున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి సత్యదేవుని నిత్యకల్యాణ మండపంలో ఈ లెక్కింపు జరుగనుంది.
ఎస్‌ఐఆర్‌కు సిద్ధం కావాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–ఎస్‌ఐఆర్) ప్రక్రియపై పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకొని పూర్తి సన్నద్ధతతో ఉండాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులకు సూచించారు. గురువారం రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) వివేక్ యాదవ్ వెలగపూడి సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెనన్స్‌కు కలెక్టర్ షణ్మోహన్ తన క్యాంపు కార్యాలయం నుంచి హాజరయ్యారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1950లోని కీలక సెక్షన్లు, ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రాధాన్యం, గత ఎస్‌ఐఆర్ (2002), సమగ్ర సవరణ ప్రక్రియలో భాగస్వామ్య పక్షాలు, బూత్ లెవెల్ అధికారి (బీఎల్‌వో), బూత్ లెవెల్ ఏజెంట్ (బీఎల్‌ఏ), ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు తదితరుల పాత్ర, ఎన్యూమరేషన్ ఫారాలు (ఈఎఫ్), ఇంటింటి సందర్శన, పరిశీలన తదితర అంశాలతో పాటు రాజకీయ పార్టీల భాగస్వామ్యంపై సీఈవో వివేక్ యాదవ్ జిల్లాల కలెక్టర్లకు వివరించారు. అనంతరం కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ సన్నద్ధతలో భాగంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియలోని ముఖ్య దశలపై అధికారులు పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకోవాలన్నారు. కాకినాడ జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ విజయవంతం చేసేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. వివిధ ఫారాల పరిష్కారం, ఎపిక్ కార్డుల జారీ తదితర అంశాలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
నేడు వందేమాతరం
150వ వార్షికోత్సవం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): దేశభక్తి గీతం ‘వందేమాతరం’ రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా శుక్రవారం ఉదయం 10 గంటలకు జిల్లావ్యాప్తంగా సామూహిక వందేమాతరం గానం నిర్వహించనున్నట్టు కలెక్టర్ కీర్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా ఒకే సమయానికి నిర్వహించేందుకు డివిజన్, మండల, గ్రామ స్థాయి అధికారులకు సూచనలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపు నిచ్చారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం, విద్యాసంస్థల, సంస్థల ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు వందేమాతరం గేయం సామూహికంగా ఆలపించాలన్నారు.
వంట నౌకరీ భూములు స్వాధీనం
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో గతంలో వంట నౌకరీ నిమిత్తం ఇచ్చిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. వంట నౌకరీ వ్యక్తులు సరిగా చేయనందున చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్‌ఏ) ఉత్తర్వుల మేరకు ధర్మదాయ శాఖ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఈఓ నల్లం సూర్య చక్రధరరావు వెల్లడించిన వివరాల మేరకు వాడపల్లి గ్రామంలో 27/2 సర్వే నెంబరులో 2.6 ఎకరాల భూమి, 48/4ఏ సర్వే నెంబరులో 4.61 ఎకరాల భూమిని గతంలో వంట నౌకరీ నిమిత్తం ఇచ్చారని, వారు సరిగా చేయకపోవడం వలన, హైకోర్టు తీర్పు, దానిని అనుసరించి సీసీఎల్‌సీ ఉత్తర్వుల మేరకు తిరిగి భూములను వారు స్వాధీనం చేసుకున్నారు. ఆయా భూముల్లో ‘ఈ భూమి వాడపల్లి వేంకటేశ్వరస్వామివారి దేవస్థానమునకు సంబంధించినది. ఎవరైనా అక్రమిస్తే ఎండోమెండ్స్ యాక్ట్ 30/1987 కింద శిక్షార్హులని హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు. అడిషనల్ కమిషనర్ వి.సత్యనారాయణ, మండల రెవెన్యూ అధికారులు, పోలీసు, దేవస్థానం సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
రత్నగిరికి పోటెత్తిన భక్తులు


