ఊరికొకరు ఎమ్మెల్యేగా చలామనీ!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఏ నియోజకవర్గానికై నా ఒకే ఒక ఎమ్మెల్యే ఉంటారు. అక్కడి అధికారులైనా, అనధికారులైనా ఆ ఎమ్మెల్యే చెప్పిందే ఆచరిస్తారు. కానీ ఊరికొక ఎమ్మెల్యే ఉన్నారంటే మీరు నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఊరికొకరు ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నారు. ఈ వింత పోకడ చూసి ఆ పార్టీ నేతలతో పాటు జనం కూడా విస్తుపోతున్నారు. ఈ నియోజకవర్గానికి జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నియోజకవర్గంలో ఆ పార్టీకి చెందిన పలువురు ద్వితీయశ్రేణి నేతలు పెత్తనం చలాయిస్తున్నారు. అధికారులు, అనధికారులు అనే తేడా లేకుండా ఎవరైనా తాము చెప్పినట్టు చేయాల్సిందేనని హుకుం జారీచేస్తున్నారు. మరికొందరైతే మేం చెప్పినట్టు చేయకుంటే శంకరగిరి మాన్యాలు పడతారంటూ అధికారులకు వార్నింగ్‌లు కూడా ఇస్తున్నారు. వివిధ శాఖల అధికారులు నేతల ఆగడాలు భరించలేకున్నా చేసేదేమీ లేక మిన్నకుండి పోతున్నారు. కొందరైతే గత్యంతరం లేని పరిస్థితుల్లో సమీప మండలాలకు బదిలీలు చేయించుకుని మరీ వెళ్లిపోతున్నారు. అటు కరప, ఇటు కాకినాడ రూరల్ మండలాల్లో నియోజకవర్గ ముఖ్యనేత పేరు చెప్పి అనుచర గణం చెలరేగిపోతోంది. అదేమని స్థానికులు నేతలను ప్రశ్నించే ధైర్యం చేయలేక పోతున్నారు. దానిని ఆసరాగా చేసుకుని అడిగే నాథుడు లేడనే ధైర్యంతో ద్వితీయ శ్రేణి నేతలు బరి తెగిస్తున్నారు.
షాడోలకు కమీషన్ ఇవ్వాల్సిందే!
గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా చేసి అధికారాన్నంతటినీ వారే చలాయిస్తున్నారు. గ్రామ స్థాయిలో పాలనా వ్యవహారాలను చక్కబెట్టే వీఆర్వోలు, సచివాలయ ఉద్యోగులు, కార్యదర్శులు చేసేదేమీ లేక వారు చెప్పిన పనులను తలాడించి చేసుకుపోతున్నారు. అడ్డగోలుగా ఉన్న పనులు చేయలేమంటే ముఖ్యనేత అనుచరులం మా మాటే కాదంటారా అంటూ బెదిరింపులకు కూడా వెనుకాడటం లేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కార్యదర్శులతో సహా ఇతర అధికారులు ఆ షాడో ఎమ్మెల్యేలు చెప్పిందే చేస్తున్నారు. వ్యవసాయ కార్యకలాపాలను చక్కబెట్టే ఒక కీలక పోస్టుకు ఇటీవలనే ఎంపికై న ముఖ్యనేత అనుచరుడు కరప మండలానికి అంతా తానే అన్నట్టు సామంత రాజులా అధికారాన్ని చలాయిస్తుండటంపై జనసేనలో సీనియర్‌లే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మండలంలో రియల్టర్‌లకు అనుకూలంగా వ్యవసాయ భూముల కన్వర్షన్, ఇల్లు నిర్మాణ ప్లాన్‌లకు అనుమతులు...ఇలా ఒక్కో పనికి ఒకో రేటు పెట్టి మరీ వసూళ్ల పర్వాన్ని సాగిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలంటే ముందుగా షాడో ఎమ్మెల్యే అనుమతి తప్పనిసరి, ఆయన ఓకే అనాలంటే ఎకరాకు రూ.2 లక్షలు ముట్టచెప్పాల్సిందే. ఇంటి ప్లాన్ అనుమతి కావాలంటే రూ.50వేలు తాంబూలం ఇచ్చుకోవాల్సిందే. ఆ షాడో ఎమ్మెల్యేకు మరో అర డజను మంది నేతలు చేరి ఈ కమీషన్‌ల దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు.
మా వాళ్లను నాలుగురాళ్లు వెనకేసుకోనివ్వండి!
చివరకు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూడా విడిచిపెట్టలేదంటున్నారు. తప్పుడు మస్తర్లు వేయించుకుని, తమ పార్టీ వారికి బయోమెట్రిక్ వేయించి, పనిచేయకుండా పంపించేసి దగ్గరుండి వేతనాలు ఇప్పిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరప ఫీల్డ్ అసిస్టెంట్ వాసంశెట్టి రాముకు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ఆ పోస్టును వదులుకున్నారు. ఈ పోస్టులో జనసేన నాయకుడు తన సోదరుడిని జాబ్ కార్డు లేకున్నా వేయించుకున్నారు. పనులను పార్టీ పక్షపాతంతో జనసేన సానుభూతిపరులకే ఇస్తున్నారు. ద్వితీయ శ్రేణి నేతల వేధింపులు, బెదిరింపులు భరించలేకున్నామని ముఖ్యనేత వద్దకు వెళుతుంటే వారికి వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతుండటంపై జనం మండిపడుతున్నారు. ‘పాపం మా వాళ్లు ఆరేళ్లుగా డబ్బు ఖర్చు పెట్టి, కష్టపడుతున్నారు. ఇప్పుడే కదా అవకాశం వచ్చింది. నాలుగురాళ్లు వెనకేసుకోనివ్వండి’ అంటూ ముఖ్యనేత సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఈ తరహా అక్రమ కార్యకలాపాలపై పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ గతంలో ఒకసారి ముఖ్యనేతకు గట్టి హెచ్చరిక చేశారనే ప్రచారం విస్తృతంగా జరిగింది. అయినా ఎక్కడా మార్పు మాత్రం కనిపించడం లేదని ఆ పార్టీలోనే చర్చ నడుస్తోంది.
కాకినాడ రూరల్ నియోజకవర్గంలో
వింత పోకడ
యథేచ్ఛగా ద్వితీయ శ్రేణి నేతల దందా
ప్రతి పనికి ముట్టజెప్పాల్సిందే
నానాజీ మనుషులమంటూ ఆగడాలు
గతంలో జనసేన అధినేత
పవన్ పిలిచి చీవాట్లు
అయినా తీరు మార్చుకోని ముఖ్యనేత
భయపడుతున్న అధికారులు
మండల కేంద్రం కరప గ్రామ పంచాయతీలో బాగా మేతకు అలవాటు పడ్డ నేత అక్కడే తిష్టవేసి తన ఆదేశాలు పాటించాల్సిందేనని స్థానిక అధికారులకు బెదిరిస్తున్నాడు. తన అనుమతి లేకుండా ఒక్క పనిచేసినా చూస్తూ ఊరుకోనంటూ హెచ్చరిస్తుండటంతో అధికారులు భయపడుతున్నారు. ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడిని తన మాట కాదంటే బయట మండలాలకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు చేస్తున్నాడు. దాదాపు కూటమి నేతలందరిదీ ఇదే తీరుగా కనిపిస్తోంది. ఈ వేధింపులు భరించలేక పెనుగుదురు గ్రామ సచివాలయ ఉద్యోగి ఒకరు పెదపూడి మండలానికి బదిలీ చేయించుకుని వెళ్లిపోయారు. అప్పటికే ఆయన ముఖ్య నేతకు రూ.2 లక్షలు ఇచ్చి బదిలీ లేకుండా ఆ స్థానంలో కొనసాగుతున్నారు. అయితే మండల నేత కమీషన్‌ల దందాకు భయపడి బదిలీపై వెళ్లిపోవడం తప్ప ఆయనకు మరో మార్గం లేకపోయింది.


