మూడు చక్రాల వాహనాల మంజూరు దరఖాస్తుల ఆహ్వానం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులైన వారికి నియోజకవర్గానికి 10 చొప్పున మూడు చక్రాల మోటారు వాహనాల మంజూరుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విభిన్న ప్రతిభావంతుల సహాయ సంస్థ సహాయ సంచాలకులు ఏవై శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా ఈనెల 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 18 సంవత్సరాల పైబడి 45 సంవత్సరాలలోపు వారు అర్హులన్నారు. కుటుంబ వార్షిక ఆదాయం గరిష్టంగా రూ.3 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్నారు. అభ్యర్థి గతంలో ప్రభుత్వం, ప్రభుత్వ ఏజెన్సీ, ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా వాహనం పొంది ఉండకూడదన్నారు.
క్యాన్సర్ బ్లాక్ నిర్మాణానికి
రూ.50 లక్షల విరాళం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కాకినాడలో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటవుతున్న క్యాన్సర్ బ్లాక్‌కు రూ.50 లక్షల విరాళాన్ని కాకినాడకు చెందిన ప్రవాస భారతీయులు ముత్యాల సీత, కుటుంబ సభ్యులు ప్రకటించారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రికి అనుబంధంగా అత్యాధునిక క్యాన్సర్ వైద్యాన్ని అందించే లక్ష్యంతో ప్రభుత్వ ఐటీఐ వెనుక క్యాన్సర్ బ్లాక్ నిర్మిస్తున్నారు. రెడ్‌క్రాస్ క్యాన్సర్ బ్లాక్‌కు అమెరికాలో స్థిరపడిన ముత్యాల భాస్కరరావు భార్య సీత, కుటుంబ సభ్యులు ఈ విరాళాన్ని ప్రకటించారు. ఈ బ్లాక్‌ను రూ.7.08 కోట్లతో నిర్మిస్తున్నారు. విరాళాన్ని ప్రకటించి పేదలకు అత్యంత ఖరీదైన క్యాన్సర్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి చేయూతనందిస్తోన్న ముత్యాల కుటుంబానికి కలెక్టర్ షన్మోహన్ సగిలి, రెడ్‌క్రాస్ రాష్ట్ర చైర్మన్ వైడీ రామారావు కృతజ్ఞతలు తెలిపారు.
మండపేటను
‘తూర్పు’లో కలపాలి
కపిలేశ్వరపురం (మండపేట): జిల్లా పరిధిలో ఉన్న మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయాలంటూ జేఏసీ నాయకులు బుధవారం కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్‌ను కోరారు. ఏడిద గ్రామ పర్యటనకు వచ్చిన కలెక్టర్‌కు ఆ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. జేఈసీ చైర్మన్ కామన ప్రభాకరరావు, మున్సిపల్ చైర్‌పర్సన్ పతివాడ నూక దుర్గారాణి, దళిత నాయకుడు ధూళి జయరాజు, బీజేపీ నాయకుడు కోన సత్యనారాయణ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కె.కృష్ణవేణి తదితరులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ తమ డిమాండ్‌కు సానుకూలంగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కోరారు.


