డీఎం అండ్ హెచ్‌వో వెంకటేశ్వరరావు
ప్రకృతిని సంరక్షిస్తే
జీవితం సురక్షితం
రాజమహేంద్రవరం రూరల్: ప్రకృతిని సంరక్షించడం ద్వారా మానవ జీవితం సురక్షితమవుతుందని, చెట్లు నాటడం జీవ రక్షణకు దారి తీస్తుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం ‘‘వరల్డ్ వన్ హెల్త్ డే’’ పురస్కరించుకొని బొమ్మూరులోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన ‘‘వన్ హెల్త్’’ వారోత్సవ కార్యక్రమాలు జిల్లాలో నిర్వహిస్తున్నామన్నారు. ఆరోగ్యం మహాభాగ్యం. ఒకరి ఆరోగ్యాన్ని కాపాడితే, సమాజంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడినట్టే అవుతుందన్నారు. ప్రకృతిని కాపాడినప్పుడే స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం సాధ్యమవుతుందన్నారు. వ్యాయామం, యోగా మన ఆరోగ్యానికి మూలాధారమని ఆయన తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు తన వంతు పాత్ర పోషించాలన్నారు.‘‘వన్ వరల్డ్ హెల్త్ డే’’ సందర్భంగా ప్రజల్లో సామాజిక ఆరోగ్య అవగాహన పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణపై చైతన్యం కల్పించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ షమ్మీకుమార్, డీపీఎంయూ డాక్టర్ శ్రీవల్లి, సూపరింటెండెంట్ స్టాలిన్, సి.సి. రాజు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


