తుపాను నుంచి పశువులను ఇలా కాపాడాలి
పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ విజయరెడ్డి
అమలాపురం టౌన్: మోంథా తుపాను హెచ్చరికల నేపథ్యంలో పశువులను మేపే రైతులంతా తమ పశువుల పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని పశు సంవర్ధక శాఖ అమలాపురం సహాయ సంచాలకులు డాక్టర్ ఎల్. విజయరెడ్డి సూచించారు. తన పరిధిలో ఉన్న రైతులను, పశు వైద్యాధికారులు, సహాయకులను ఆయన అప్రమత్తం చేశారు. పశువులను పెంచే పలు ప్రాంతాలకు డాక్టర్ విజయరెడ్డి సోమవారం వెళ్లి పశు పోషణ రైతులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. తుపాను కారణంగా పశువుల్లో అస్వస్థత, మరణాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు.
జాగ్రత్తలు ఇలా..
● పశువుల షెడ్లు గాలి వానకు కూలి పోకుండా మరమ్మతులు చేయించాలి.
● పశువులకు నట్టల నివారణ మందులను వాడి వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి.
● బాహ్య పరాన్న జీవుల నిర్మూలన మందులను వాడాలి.
● విష సర్పాల నుంచి కాపాడుకోవాలి.
● అధిక వర్షాలు, తుపాను సమయంలో పశువులను రాటకు కట్టకుండా వదిలేయాలి.
● లేగ దూడలు చలి బారిన పడకుండా వెచ్చని వాతావరణం కల్పించాలి.
● అవసరాలకు అనుగుణంగా దాణాను, మేతను నిల్వ ఉంచుకోవాలి.
● పశువులను విద్యుత్ తీగలకు, కరెంట్ స్తంభాలకు దూరంగా ఉంచాలి.
● వాతావరణ కేంద్రం సూచనలకు అనుగుణంగా యాజమాన్య పద్ధతులు పాటించాలి.
● పశువుల మేత తడిసిపోకుండా భద్ర పరుచుకోవాలి.
● పశువుల దాణా తడిస్తే బూజు పడుతుంది కాబట్టి జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి.
● పశువులను వర్షంలో మేతలకు తోలకూడదు.
● కూలిపోయే అవకాశం ఉన్న చెట్ల కింద, గోడల దగ్గర, పాకల దగ్గర పశువులను కట్టకూడదు.
● పశువులు వర్షంలో తడిస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గిపోయి జబ్బు పడి చనిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దూడలు, గొర్రెలను తడవకుండా కాపాడుకోవాలి.
● పశువులకు ఏమైనా జబ్బుగా ఉంటే దగ్గరలోని పశు వైద్య సిబ్బందికి తెలియజేస్తే తక్షణమే వైద్యం అందుతుంది.
● పశువులు ఎక్కడైనా చనిపోతే పశు వైద్య సిబ్బందికి తెలియజేస్తే పై అధికారులకు వివరాలు పంపేందుకు వీలు ఉంటుంది.
● గేదెలు, ఆవులకు పచ్చిక దొమ్మ, జబ్బ వాపు రాకుండా, గొర్రెలకు నేల మరక రాకుండా టీకాలు వేయించుకోవాలి.
● పశువులకు తుపాను కారణంగా ఏ చిన్న సమస్య ఎదురైనా తక్షణమే ఆ సమాచారాన్ని రైతులకు సమీపంలో ఉన్న పశు వైద్యాలయం లేదా పశు వైద్యాధికారులకు అందజేస్తే తమ సిబ్బంది తక్షణమే స్పందిస్తారని సహాయ సంచాలకులు డాక్టర్ విజయరెడ్డి విజ్ఞప్తి చేశారు.


