పర కాల్వలో పడి బాలుడి గల్లంతు
● మేనమామతో కాజ్ వే దాటుతుండగా గోతిలో పడిన బైక్
● రాత్రి వరకు ఎస్‌డీఆర్‌ఎఫ్, ఫైర్ సిబ్బంది గాలింపు
కాకినాడ రూరల్: మండలంలోని సూర్యారావుపేట గ్రామ పరిధిలోని పర కాల్వలో సోమవారం 12 ఏళ్ల బాలుడు పోలవరపు సాయి చరణ్ రుత్విక్ గల్లంతయ్యాడు. తిమ్మాపురం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ మధురానగర్‌కు చెందిన పోలవరపు రమణకు భార్య, పాప, బాబు ఉన్నారు. రమణ వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. బడికి సెలవు ఇవ్వడంతో కుమారుడు చరణ్ కాకినాడ ఆర్టీఓ కార్యాలయం వద్ద గల మేనమామ కొప్పిశెట్టి శ్రీనివాస్ ఇంటికి వచ్చాడు. నేమాం గ్రామంలో శ్రీనివాస్ ఇల్లు నిర్మించుకుంటుండడంతో చూసేందుకు మేనల్లుడితో కలిసి ఉదయం 11గంటల సమయంలో బయలుదేరాడు. సూర్యారావుపేట గ్రామం దాటిన తరువాత పోలవరం గ్రామ మార్గంలో పంట పొలాల్లో నుంచి వచ్చే నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్న పర కాల్వ కాజ్ వే దాటే ప్రయత్నం చేశారు. కాజ్ వే పైనుంచి నీరు ప్రవహిస్తుండడంతో బైక్‌పై వెళుతూ నీటి అడుగున వంతెనపై ఉన్న గోతిలో పడ్డారు.
శ్రీనివాస్ ఒక వైపునకు, చరణ్ కాల్వ వైపు పడిపోయారు. శ్రీనివాస్ తేరుకుని వచ్చే లోపు కాల్వలో ఈదుతూ చరణ్ కనిపించాడు. వెంటనే అవతలి ఒడ్డుకు వెళ్లే ప్రయత్నాన్ని శ్రీనివాస్ చేసేలోపు చరణ్ నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. దీంతో వెంటనే స్థానికులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న తిమ్మాపురం ఎస్సై గణేష్‌కుమార్, సిబ్బంది పర కాల్వ వద్దకు చేరుకుని ప్రమాదం జరిగిన ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రయోజనం లేకపోవడంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. గల్లంతైన బాలుడి కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది మధ్యాహ్నం 3.30 గంటల నుంచి గాలించారు. రాత్రి చీకటి పడేవరకు దాదాపు మూడు గంటల పాటు కాల్వ దిగువ భాగంలో గాలింపు చేపట్టినా బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. ప్రమాదం జరిగిన కాల్వను తహసీల్దార్ కుమారి తదితరులు సందర్శించారు. తుపాను నేపథ్యంలో ప్రమాదభరితమైన పర కాల్వ కాజ్‌వే వంతెనపై రాకపోకలు బంద్ చేయకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పర కాల్వలో పడి బాలుడి గల్లంతు


