కాకినాడ కుంభాభిషేకం వద్ద ఒడ్డుకు చేరిన మత్స్యకార బోట్లు
జిల్లా వాసుల గుండెల్లో తుపాను అలజడి
జిల్లా యంత్రాంగం అప్రమత్తం
లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపు
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూము ఏర్పాటు
నెలాఖరు వరకూ పాఠశాలల మూసివేత
ఉద్యోగులకు సెలవుల రద్దు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): గత వారంలో అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. వాటి నుంచి జిల్లా వాసులు తేరుకుంటున్నారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎండ కాసి, వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. కానీ, ఇదే సమయంలో మోంథా తుపాను ఉగ్ర రూపంతో దూసుకొస్తోందన్న వార్త మాత్రం జిల్లా వాసులను కలవరపరుస్తోంది. మారిన వాతావరణం తుపాను ప్రశాంతత అనే రీతిలో కనిపిస్తోంది. ఈ తుపాను తీవ్ర రూపం దాల్చి కాకినాడ వద్ద తీరం దాటుతుందనే వార్తతో ఇక్కడి ప్రజల గుండెల్లో అలజడి రేగుతోంది. పలువురు 1996 తుపాను సృష్టించిన విధ్వంసాన్ని గుర్తు చేసుకుని వణికిపోతున్నారు.
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి, తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించిన విష యం తెలిసిందే. దీనికి ‘మోంథా’ అని పేరు పెట్టారు. ఇది కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని, ఆ సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, కనీసం 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ తుపాను ప్రభావంతో సోమవారం నుంచి గురువారం వరకూ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చని భావిస్తున్నారు. మరోవైపు సముద్ర అలలు పెద్ద ఎత్తున ఎగసిపడే ప్రమాదం పొంచి ఉంది. వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
ముందస్తు చర్యలు
తుపాను నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ షణ్మోహన్ సగిలి జిల్లాలోని ఉన్నతాధికారులు, మండల, జోన్ అధికారులతో ఆదివారం అత్యవసర టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎటువంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రాణ, ఆస్తి, పంట నష్టాలు జరగకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలన్నీ తీసుకోవాలని సూచించారు. జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిల్లో పని చేసే అధికారులు, సిబ్బంది వారివారి ప్రదేశాల్లోనే ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు.
తీర ప్రాంతం.. అప్రమత్తం
తుపాను ప్రభావం ముందుగా సముద్ర తీర ప్రాంతం పైనే ఉంటుంది. అందువలన జిల్లా యంత్రాంగం ప్రధానంగా తీర గ్రామాలపై దృష్టి సారించింది. తొండంగి, యు.కొత్తపల్లి, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, తాళ్లరేవు మండలాలు సముద్ర తీరంలో ఉన్నాయి. ఆయా మండలాల నుంచి సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను ఇప్పటికే వెనక్కి రప్పిస్తున్నారు. ఎవరైనా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్తే వారిని సురక్షితంగా తీరానికి చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ షణ్మోహన్ మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు. తుపాను ప్రభావం ఉండే గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా 269 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూము ఏర్పాటు చేశారు.
హోప్ ఐలాండ్ నుంచి..
రెవెన్యూ అధికారులు ఆదివారం ఉదయం కాకినాడ సమీపంలోని హోప్ ఐలాండ్‌కు వెళ్లి అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు రావాలని సూచించారు. అయితే, అక్కడి ప్రజలు ససేమిరా అనడంతో చేసేది లేక తిరిగి వచ్చారు. మోంథా తుపాను ప్రభావం జిల్లాపై అధికంగా ఉన్న విషయం చెప్పి, వారిని అక్కడి నుంచి తరలించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో రెవెన్యూ, పోలీసు అధికారులు సాయంత్రం అక్కడకు ప్రత్యేక బోట్లు పంపించారు. పోలీసుల సాయంతో ఉన్న హోప్ ఐలాండ్‌లో ఉన్న 110 మందిని తాళ్లరేవులోని సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చారు.
ఉప్పాడ రోడ్డు మూసివేత
కాకినాడ నుంచి సూర్యారావుపేట మీదుగా ఉప్పాడ వెళ్లే ప్రధాన రహదారిని తుపాను కారణంగా మూసివేశారు. ఈ రోడ్డులో ఎవ్వరూ వెళ్లకుండా పోలీసులు గస్తీ ఏర్పాటు చేశారు. కాకినాడ సూర్యారావుపేట బీచ్‌లోనికి కూడా సందర్శకులు వెళ్లకుండా ఏర్పాట్లు చేశారు.
31 వరకూ విద్యా సంస్థలకు సెలవు
మోంథా తుపాను నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, గురుకుల హాస్టళ్లలోని విద్యార్థులను సైతం వారి వారి ఇళ్లకు పంపిచేశారు.
పీజీఆర్‌ఎస్ రద్దు
కలెక్టరేట్‌తో పాటు ఆర్‌డీఓ, మండల కార్యాలయాలు, సచివాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని తుపాను నేపథ్యంలో ఈ వారం రద్దు చేశారు. కలెక్టర్ షణ్మోహన్ ఈ విషయం తెలిపారు.
జిల్లాకు ప్రత్యేకాధికారి
మోంథా తుపాను నేపథ్యంలో జిల్లాకు ఐఏఎస్ అధికారి మైలవరపు కృష్ణతేజను ప్రత్యేకాధికారిగా నియమించారు. ఆయన జిల్లాలోని అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.
కలెక్టరేట్ కంట్రోల్ రూము నంబర్ 0884–2356801
సన్నద్ధంగా ఉండాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): మోంథా తుపానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధతతో ఉండాలని కలెక్టర్ షణ్మోహన్, జిల్లా ప్రత్యేక అధికారి మైలవరపు కృష్ణతేజ అధికారులను ఆదేశించారు. తుపాను నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై ఎస్పీ బిందుమాధవ్, ఇతర ఉన్నతాధికారులు జిల్లాలోని అన్న మండలాల క్షేత్రస్థాయి అధికారులతో కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తొండంగి, ఉప్పాడ, తాళ్లరేవు, కాకినాడ రూరల్, పట్టణ ప్రాంతాల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అన్ని గ్రామాల్లోనూ తుపాను హెచ్చరికలు జారీ చేసి, ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేకాధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాల్లోని సహాయక శిబిరాలకు, బాలింతలు, వృద్ధులను సమీప ఆస్పత్రులకు ముందుగానే తరలించాలని సూచించారు. ఆస్పత్రుల్లో వైద్యులకు ప్రత్యేక డ్యూటీలు వేసి, మందులు సిద్ధంగా ఉంచాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. 108, 104 వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. పునరావాస కేంద్రాలకు అవసరమైన కూరగాయలు, నిత్యావసర వస్తువులు, ఇతర సామగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. కోతకు వచ్చిన పంటలు రెండు మూడు రోజుల పాటు కోయకుండా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. వీఆర్‌ఓలు, పంచాయతీ కార్యదర్శుల ద్వారా సహాయక శిబిరాలను గుర్తించాలని, ఏయే ప్రాంత ప్రజలను ఎక్కడికి తరలించాలో ముందుగానే జాబితా సిద్ధం చేసుకోవాలని అన్నారు.
హోప్ ఐలాండ్ ప్రజలను ప్రత్యేక బోట్‌లో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పోలీసులు
సూర్యారావుపేట బీచ్ రోడ్డు మూసివేసిన కాకినాడ రూరల్ తహసీల్దార్ కుమారి, ఎంపీడీఓ సతీష్ తదితరులు
దూసుకొస్తున్న మోంథా


