రత్నగిరిపై మోంథా ఎఫెక్ట్
● కార్తిక సోమవారం 80 వేల మంది వస్తారని అంచనా
● తుపాను ప్రభావంతో 40 వేలకే పరిమితమైన భక్తులు
అన్నవరం: రత్నగిరిపై మోంథా తుపాను ప్రభావం పడింది. కార్తిక మాసంలో తొలి సోమవారం కావడంతో సుమారు 80 వేల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేసి, ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. అయితే తుపాను హెచ్చరికలతో భక్తుల సంఖ్య 40 వేలకే పరిమితమైంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ మాత్రమే ఆలయంలో రద్దీ నెలకొనగా, ఆ తరువాత నుంచి దేవస్థానం క్యూ లైన్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. సత్యదేవుని వ్రతాలు ఏడు వేలు జరుగుతాయని అధికారులు భావించగా 4,500 మాత్రమే జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.35 లక్షల ఆదాయం సమకూరింది. ఆలయంలో ఏర్పాట్లను దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు పర్యవేక్షించారు. తుపాను ప్రభావంతో మంగళ, బుధవారాల్లో కూడా భక్తులు పెద్దగా రకపోవచ్చునని అంచనా వేస్తున్నారు.
వర్షంతో ఇబ్బందులు
తుపాను ప్రభావంతో రత్నగిరిపై కురిసిన వర్షంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. దేవస్థానంలో పలుచోట్ల విశ్రాంతి షెడ్లు నిర్మించినప్పటికీ ఆలయం చుట్టూ ఉన్న రథం పాత్, పశ్చిమ రాజగోపురం ముందు గ్రీన్ షేడ్ నెట్‌తో ఏర్పాటు చేసిన షెల్టర్లే ఉన్నాయి. వీటి ద్వారా ఎండ నుంచి రక్షణ ఉంటుంది తప్ప వర్షం వస్తే ఏమాత్రం ఉపయోగం ఉండదు. దీంతో, వర్షం కురిసిన సమయంలో వీటి కింద ఉన్న భక్తులు తడిసిపోయారు. పశ్చిమ రాజగోపురం లోపలకు వెళ్లేందుకు నిర్మించిన ర్యాంపు మీద కూడా షెల్టర్ లేక భక్తులు వర్షంలో తడవాల్సి వచ్చింది. ఇక్కడ పొడవాటి షెల్టర్ నిర్మించినా అది ర్యాంపు వరకూ లేకపోవడంతో ఇబ్బంది తప్పలేదు. ఆదివారం రాత్రి, సోమవారం తెల్లవారుజామున దేవస్థానంలో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు వారి బంధువులు, ఇతర ప్రాంతాల్లో వివాహాలు చేసుకున్న వారు సత్యదేవుని దర్శనానికి వచ్చి, వర్షంలో ఇబ్బంది పడ్డారు. వర్షానికి తడిసిపోకుండా పలువురు గొడుగులు వేసుకుని, వ్రత మండపాలు, ఆలయానికి వెళ్లారు. కార్తిక మాసం సందర్భంగా దేవస్థానంలో పలుచోట్ల వేసిన రేకులతో షెడ్లు నిర్మించి, వాటిని క్లాత్‌తో అలంకరించారు. తుపాను గాలులకు ఆ షెడ్డు రేకులు ఎగిరిపోయే అవకాశం ఉండటంతో, వాటిని తాళ్లతో గట్టిగా కట్టి రక్షణ చర్యలు చేపట్టారు. మొత్తం అన్ని షెడ్ల మీద ఇటువంటి చర్యలు తీసుకున్నట్లు దేవస్థానం ఈఈ రామకృష్ణ తెలిపారు.
ఇలా చేస్తే మేలు
రథం పాత్‌లో తూర్పు రాజగోపురానికి ఇరువైపులా టెన్‌సిల్ షెడ్లు భక్తులకు వర్షం నుంచి రక్షణ కల్పించాయి. ఇదేవిధంగా రథం పాత్ చుట్టూ కూడా గ్రీన్ షేడ్ నెట్ స్థానంలో టెన్‌సిల్ షెడ్లు నిర్మిస్తే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుంది. వర్షం కురిస్తే శని, ఆదివారాల్లో నిర్వహించే స్వామివారి తిరుచ్చి, రథ సేవలను నిలిపివేస్తున్నారు. టెన్‌సిల్ షెడ్లు నిర్మిస్తే వర్షం వచ్చినా ఆ సేవలు యథాతథంగా నిర్వహించే అవకాశం ఉంటుంది.
రత్నగిరిపై మోంథా ఎఫెక్ట్


