రాజకీయ బలోపేతమే శెట్టిబలిజల లక్ష్యం
● సందడిగా శెట్టిబలిజ కార్తిక వన మహోత్సవం, ఉచిత వివాహ పరిచయ వేదిక
● మంత్రులు, ఎమ్మెల్సీలు, ప్రముఖుల హాజరు
రాజమహేంద్రవరం రూరల్: శెట్టిబలిజ సామాజిక వర్గం రాజకీయంగా బలోపేతం కావాల్సిన అవసరం ఉందని పలువురు ప్రముఖులు స్పష్టం చేశారు. రాష్ట్ర శెట్టిబలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హైవే పక్కనున్న చెరుకూరి తోటలో శెట్టిబలిజ కార్తిక వన మహోత్సవం, శెట్టిబలిజ వధూవరుల ఉచిత వివాహ పరిచయ వేదిక నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, విశిష్ట అతిథులుగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు, శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, వైఎస్సార్ సీపీ రాజమండ్రి పార్లమెంటరీ ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ మాట్లాడుతూ, శెట్టబలిజలు రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షించారు. మంత్రి సుభాష్ మాట్లాడుతూ, శెట్టిబలిజ సామాజిక వర్గ సంక్షేమానికి చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో ఆదరణ పథకంలో గీత సామాజిక వర్గం వారికి ఉపకరణాలు అందిస్తామని, బీసీ కార్పొరేషన్ రుణాలూ అందుతాయని చెప్పారు. ఈ సందర్భంగా శెట్టిబలిజ సంఘానికి సేవలు చేసిన ప్రముఖుల స్మారక అవార్డులను పది మందికి ప్రదానం చేశారు. సంఘ నూతన సంవత్సర క్యాలెండర్‌ను మంత్రి సుభాష్ ఆవిష్కరించారు. అనంతరం సంఘ రాష్ట్ర నాయకుడు సానబోయిన రామారావును సత్కరించారు. సంఘ రాజమండ్రి నాయకులు, శెట్టిబలిజ ప్రముఖులను మంత్రి శాలువా, జ్ఞాపికలతో సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర శెట్టిబలిజ, గౌడ, ఈడిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీను, రాష్ట్ర ఖాదీ బోర్డు మాజీ వైస్ చైర్మన్ పిల్లి నిర్మల, సంఘ ప్రతినిధులు, సంఘీయులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రాజకీయ బలోపేతమే శెట్టిబలిజల లక్ష్యం


