పేద కుటుంబంలో చిమ్మిన విషాదం
● బైక్‌ను ట్రాక్టర్ ఢీకొని తల్లి మృతి
● కుమారుడి పరిస్థితి విషమం
● కూలీ పనులకు వెళ్లొస్తుండగా ప్రమాదం
గండేపల్లి/జగ్గంపేట: రెక్కాడితే కానీ డొక్కాడని ఆ పేద కుటుంబంపై ట్రాక్టర్ రూపంలో పెనుకష్టం వచ్చి పడింది. కూలీ పనులే జీవనాధారంగా బతుకుతున్న ఆ కుటుంబంలో ఒకరిని మృత్యువు బలిగొనగా.. మరొకరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో తల్లి మృతి చెందగా, కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గుర్రప్పాలెం పంచాయతీ పరిధిలోని సగరపేటకు చెందిన తల్లీకొడుకులు నక్కా చిట్టమ్మ(40), బాపిరాజు ఆదివారం మోటార్ సైకిల్‌పై జగ్గంపేట కూలీ పనులకు వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా.. సగరపేట సమీపంలో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ బలంగా ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. బంధువులు, స్థానికులు క్షతగాత్రులను చికిత్స కోసం గండేపల్లి మండలం జెడ్.రాగంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే చిట్టమ్మ మరణించినట్టు ధ్రువీకరించారు. తీవ్ర గాయాలతో ఉన్న బాపిరాజును మెరుగైన వైద్యం కోసం కాకినాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎసై టి.రఘునాథరావు తెలిపారు.
రెక్కాడితే కానీ..
పేద కుటుంబం కావడంతో రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఆ కుటుంబానిది. మృతురాలు చిట్టమ్మ, భర్త వెంకన్న, పెద్ద కొడుకు పురుషోత్తం, చిన్న కొడుకు బాపిరాజు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం కూలీ పనులు ముగించుకుని వస్తుండగా ఈ ప్రమాదానికి గురయ్యారు.
డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం
మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో మృతురాలి తలకు తీవ్ర గాయమై, కొంత భాగం ట్రాక్టర్ ట్రక్కుకు అంటుకున్నట్టు చెప్పారు. గ్రామంలో జన సంచారం ఉండే ప్రాంతంలో ట్రాక్టర్‌ను డ్రైవర్ అజాగ్రత్తగా, వేగంగా నడిపి ప్రమాదానికి కారణమయ్యాడన్నారు. ఇటువంటి వాటిపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


