
పిఠాపురం వైద్యులపై విచారణ జరపాలి
పిఠాపురం: పురిటిలోనే తల్లి మృత్యువాత పడటం చాలా దారుణమని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగా గీతా విశ్వనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురం ఆస్పత్రిలో వైద్యం వికటించి, బాలింత మృత్యువాత పడిన సంఘటన పైన, సంబంధిత వైద్యుల పైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో మృతురాలి కుటుంబాన్ని బుధవారం ఆమె పరామర్శించారు. బాధిత కుటుంబానికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో అత్యంత పటిష్టంగా పని చేసిన వైద్య రంగాన్ని కూటమి ప్రభుత్వం పట్టించకోవడం మానివేసిందన్నారు. మాతా శిశు సంరక్షణలో ప్రభుత్వాస్పత్రికి మించింది లేదనే నమ్మకం గతంలో ఉండేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వాస్పత్రికి వెళ్తే ప్రమాదమన్నట్టుగా ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా చేస్తున్నారని దుయ్యబట్టారు. చేబ్రోలుకు చెందిన శ్రీదుర్గను హైరిస్క్ బాలింతగా అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు ధ్రువీకరించారన్నారు. నెలలు నిండకుండా కేవలం వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్తే ఆమె బలవంతంగా పురుడు పోసే ప్రయత్నం చేసినట్లు మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారన్నారు. ఎటువంటి రక్షణ చర్యలూ తీసుకోకుండా బలవంతంగా పురుడు పోయడం వల్లనే తల్లి చనిపోయిందని చెబుతున్నారన్నారు. చివరకు పుట్టిన బిడ్డ కూడా అనారోగ్యంతో దివ్యాంగురాలిగా ఉందని, దీనంతటికీ వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఈ సంఘటనను ఇప్పటికే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారని, ఉన్నతాధికారులతో విచారణ జరిపించి, బాలింత మృతికి కారకులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని గీత డిమాండ్ చేశారు. పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో దిగజారిపోతున్న వైద్య సేవలపై అధికార పార్టీ నేతలు, అధికారులు దృష్టి సారించాలని, పేదలకు మంచి వైద్యం అందేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో గొల్లప్రోలు జెడ్పీటీసీ సభ్యుడు ఉలవకాయల నాగ లోవరాజు, సర్పంచ్ దొండపాటి లోవతల్లి తదితరులు పాల్గొన్నారు.
ఫ వైద్య వ్యవస్థను పాలకులు
పట్టించుకోడం లేదు
ఫ పురిటిలోనే తల్లి
మృత్యువాత పడటం దారుణం
ఫ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి
ఫ వైద్యులపై చర్యలు తీసుకోవాలి
ఫ వైఎస్సార్ సీపీ నేత వంగా గీత