
రత్నగిరిపై రద్దీ
అన్నవరం: కార్తిక మాసం తొలి రోజైన బుధవారం నుంచే రత్నగిరిపై భక్తుల రద్దీ మొదలైంది. సాధారణంగా కార్తిక శుద్ధ చవితి (నాగుల చవితి) వరకూ రత్నగిరికి భక్తుల తాకిడి పెద్దగా ఉండదు. కానీ, తొలి రోజైన పాడ్యమి నాడే సుమారు 30 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకోవడం విశేషం. తెల్లవారుజామున 4 గంటలకే స్వామివారి ఆలయం తెరచి భక్తులను దర్శనానికి అనుమతించడంతో పాటు వ్రతాల నిర్వహణ కూడా ప్రారంభించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ భక్తుల రద్దీ కొనసాగింది. స్వామివారి ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట సమయం పట్టింది. స్వామివారిని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. తూర్పు రాజగోపురం ముందున్న రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి, పూజలు చేశారు. సత్యదేవుని వ్రతాలు 1,800 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. సత్యదేవుని సన్నిధిలో శనివారం నుంచి భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ తరువాత ఆదివారం, సోమవారం పర్వదినాలు కావడంతో ఆ మూడు రోజులూ సత్యదేవుని ఆలయానికి లక్ష మందికి పైగా భక్తులు వచ్చేస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి వ్రతాలు ఆది, సోమవారాల్లో తెల్లవారుజామున ఒంటి గంట నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.