
దారీతెన్నూ లేదు!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పారిశ్రామిక ప్రగతిలో పరుగులు పెడుతున్నామంటున్న కూటమి సర్కారు.. పారిశ్రామిక వాడ నిండా మునిగిపోయినా నిర్లక్ష్యాన్నే ప్రదర్శిస్తోంది. పరిశ్రమల ఏర్పాటు కోసం పెదబాబు, చినబాబు దేశాలు పట్టుకుని తిరుగుతున్నారు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్, అమరావతిలో క్లౌడ్ టెక్నాలజీ వంటి ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చేస్తోందని గొప్పగా ప్రకటించుకుంటున్నారు. అసలు అవన్నీ ఎప్పుడు వస్తాయో తెలియదు కానీ ఉన్న పారిశ్రామికవాడలు కాస్తా నిండా నీట మునిగిపోతున్నా నిర్లక్ష్యం చూపుతున్నారు.
ఇలా ఏర్పడింది..
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాగా ఉండగా కాకినాడ సర్పవరం భావనారాయణస్వామి ఆలయ సమీపాన సుమారు 25 ఎకరాల్లో పారిశ్రామికవాడ (ఆటోనగర్) ఏర్పాటైంది. మోటారు వాహనాల వర్క్‌షాపులు, వెల్డింగ్ మెషీన్ యూనిట్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ప్యానల్ బోర్డుల తయారీ వంటి యూనిట్లు అప్పట్లో కాకినాడ నగరంలో ఎక్కడి పడితే అక్కడ నిర్వహించేవారు. దీనివలన నగరంలో కాలుష్యం పెరిగిపోవడంతో పాటు జనావాసాలకు చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ నేపథ్యంలో అప్పటి మోటార్ యూనియన్ ప్రతినిధిగా నాగం వీర్రాజు తదితరులు 1999 నుంచి జరిపిన కృషి ఫలితంగా ఆటోనగర్ ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది. అప్పట్లో ఒక్కొక్కరికి ఐదారు వందలు నుంచి ఏడు వందల మీటర్ల స్థలాలు వంతున మీటరు రూ.170కి ఏపీఐఐసీ ద్వారా ఇచ్చారు. ఇక్కడి వారందరూ మోటార్ ఇంజిన్ల మరమ్మతులు, విడి భాగాల అసెంబ్లింగ్, లారీ, ట్రాక్టర్ తదితర మెకానిక్ షెడ్లు, ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతుల వంటి చిన్న, మధ్యతరహా యూనిట్లు 260 వరకూ ఇక్కడున్నాయి. ఆటోనగర్‌పై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా 12 వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.
ఆక్రమణలతో..
సామర్లకోట నుంచి కాకినాడకు వచ్చే గోదావరి కాలువ ముంపే ఆటోనగర్‌కు పెద్ద శాపంగా మారింది. మాధవపట్నం వద్ద ఈ కాలువ ఆక్రమణలతో కుచించుకుపోయింది. మాధవపట్నం నుంచి కాకినాడ రూరల్ మండలం సర్పవరం వెళ్లే మార్గంలో ఈ కాలువ వెడల్పు 12 అడుగులు ఉండాలి. కానీ, ఆక్రమణలతో నాలుగడుగులకు కుదించుకుపోయింది. దీంతో, ఇది దిగువన ఉన్న ఆటోనగర్‌ను ముంచెత్తుతోందని యూనిట్ల యజమానులు, కార్మికులు చెబుతున్నారు. ఆటోనగర్ వరకూ ఉన్న ఈ కాలువ ఆక్రమణలకు గురవుతున్నా ఏపీఐఐసీతో పాటు సంబంధిత అధికారులెవ్వరూ పట్టించుకోవడం లేదు. చాలా కాలంగా ఈ సమస్యపై మొర పెట్టుకుంటున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన కూడా లేదని ఆటోనగర్‌లోని యజమానులు, కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతర్గత డ్రైన్ల నిర్మాణం, రోడ్లు మరమ్మతులు చేపట్టాల్సిన యంత్రాంగం నిధుల్లేవంటూ చేతులెత్తేస్తోంది. ఇన్ని వేల మంది పొట్ట కొడుతున్న ఆటోనగర్ ఇండస్ట్రియల్ పార్క్ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఇక్కడి వారు కోరుతున్నారు.
ఫ ఆటోనగర్‌లో అష్టకష్టాలు
ఫ పోటెత్తిన సామర్లకోట గోదావరి కాలువ
ఫ వెళ్లేదెలా.. బయటకు వచ్చేదెలా?
ఫ ముంపులో లక్షల విలువైన యూనిట్లు
ఐదారు రోజులుగా ముంపులో..
నగరంలో ఇష్టమొచ్చినట్టు నిర్వహిస్తున్న మోటార్ రంగాన్ని ఒకచోట ఏర్పాటు చేయాలనే సంకల్పం మంచిదే. కానీ తాంబూలం ఇచ్చేశాం అనే సామెత చందంగా స్థలాలిచ్చారు తప్ప, కనీస మౌలిక వసతులు కూడా కల్పించ లేదు. అదే ఇప్పుడు ఆటోనగర్‌కు శాపమైంది. ఏపీఐఐసీ అజమాయిషీలో నడుస్తున్న ఈ ఆటోనగర్ ప్రస్తుతం సామర్లకోట – కాకినాడ కాలువ ముంపు నీటితో మునిగిపోయింది. ఐదారురోజులుగా ముంపు నీటిలో నానుతున్నా పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు. ఆటోనగర్‌లో ఎనిమిది అంతర్గత రహదారులున్నాయి. వీటిలో కొన్ని మోకాలి లోతు, మరికొన్ని నడుం లోతు నీట మునిగిపోయాయి. ఎటు చూసినా ముంపు నీరు ముట్టడించడంతో ఆయా యూనిట్లలో అడుగు పెట్టలేని దుస్థితి నెలకొంది. ఆటోనగర్‌కు వెళ్లాలన్నా, అక్కడి నుంచి బయటకు రావాలన్నా నరకం చూస్తున్నారు. ముంపుతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఎప్పటి మాదిరిగానే రోజువారీ పనులు ముగించుకుని ఎక్కడి మెషీన్లు అక్కడే విడిచిపెట్టి, ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ముంపులో మునిగిపోయి లక్షల్లో నష్టపోయామని ఆయా యూనిట్ల యజమానులు గగ్గోలు పెడుతున్నారు.

దారీతెన్నూ లేదు!

దారీతెన్నూ లేదు!