
ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
కాకినాడ క్రైం: స్థానిక జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ షణ్మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశిష్ట అతిథులుగా స్థానిక ప్రజాప్రతినిథులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద పరేడ్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తూండటం స్ఫూర్తిదాయకమని అన్నారు. నాయకులు మాట్లాడుతూ పోలీసు అమర వీరుల కుటుంబాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఆయా కుటుంబాలకు నగదు అందించి, పండ్లు పంచారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, చినరాజప్ప, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
డీఏ జీఓ మోసపూరితం
కరప: రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు డీఏ మంజూరు చేస్తూ జారీ చేసిన జీఓ మోసపూరితమైనదని యూటీఎఫ్ జిల్లా నాయకుడు ఐ.ప్రసాదరావు విమర్శించారు. గురజనాపల్లిలో మంగళవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు 2024 జనవరి నుంచి ఇవ్వాల్సిన కరవు భత్యం (డీఏ) 3.64 శాతం ఈ నెల నుంచి చెల్లించేందుకు జీఓ 60 జారీ చేశారన్నారు. అయితే 2024 జనవరి నుంచి చెల్లించాల్సిన 21 నెలల బకాయిలు ఉద్యోగులు రిటైరయ్యాక చెల్లిస్తామంటూ జీఓ జారీ చేయడం సరికాదన్నారు. పెన్షనర్లకు 2027–28లో చెల్లించాలంటూ మరో జీఓ 61 జారీ చేశారన్నారు. ఇది ఉద్యోగులను మోసం చేయడమేనని పేర్కొన్నారు. సర్వీసులో ఉన్న ఉద్యోగులకు వారి ఖాతాల్లో తక్షణం జమ చేయాలని, అలా సర్దుబాటు కాకుంటే ఉద్యోగ, ఉపాధ్యాయుల వ్యక్తిగత పీఎఫ్ ఖాతాల్లో బకాయిలు జమ చేయాలని ప్రసాదరావు డిమాండ్ చేశారు. సీపీఎస్ ఉద్యోగులకు 90 శాతం నగదు, పెన్షనర్లకు తక్షణం నగదు చెల్లించాలని కోరారు. ఎరియర్లకు సంబంధించిన జీఓను సవరించాలని యూటీఎఫ్ జిల్లా నాయకుడు ప్రసాదరావు అన్నారు. ఇటువంటి జీఓల మూలంగా ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారన్నారు. భవిష్యత్లో ఉద్యోగులకు డీఏ చెల్లించకుండా ప్రభుత్వాలు తాత్సారం చేసే అవకాశముందని చెప్పారు. ఈ జీఓ సవరణ కోసం ఉద్యమించేందుకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు సన్నద్ధం కావాలని ప్రసాదరావు పిలుపునిచ్చారు.
నేటి నుంచి కార్తిక మాసోత్సవాలు
సామర్లకోట: స్థానిక పంచారామ క్షేత్రమైన బాలాత్రిపుర సుందరీ సమేత కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయంలో కార్తిక మాసోత్సవాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. కోనేరులో గోదావరి జలాలు నింపారు. ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక దర్శనాలకు సంబంధించి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. రోజూ సాయంత్రం ఆకాశ దీపం వెలిగించి, పూజలు చేస్తారు. కార్తిక మాసంలో నవంబర్ 5న పౌర్ణమి, 6న కృత్తికా నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామివారి గ్రామోత్సవం, అనంతరం జ్వాలాతోరణం నిర్వహిస్తారు. 18న మాస శివరాత్రి పూజలు, 20వ తేదిన అమావాస్యను పురస్కరించుకొని ఆలయంలో కోటి దీపోత్సవం, 21న పోలి పాడ్యమి సందర్భంగా స్వామి వారి జటాజూటం అలంకరణ ఉంటాయని ఈఓ బళ్ల నీలకంఠం, ట్రస్టు బోర్డు చైర్మన్ కంటే జగదీష్ మోహనరావు తెలిపారు.

ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం