
పండగ పూటా.. పస్తులే..
కాకినాడ క్రైం: మహిళా, శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్) అనుబంధ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు పండగ పూటా పస్తులు తప్పడం లేదు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వంటి ఉన్నత చదువులు చదివి, ప్రభుత్వ ఒప్పంద ఉద్యోగాల్లో చేరి, గొడ్డు చాకిరీ చేస్తున్నా.. వారికి ప్రభుత్వం నెలల తరబడి జీతాలు చెల్లించడం లేదు. ఐసీడీఎస్‌కు అనుబంధంగా జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీపీయూ), శిశుగృహ, వన్‌స్టాప్ సెంటర్ (ఓఎస్‌సీ), డొమెస్టిక్ వయోలెన్స్ సెల్(డీవీసీ) సీ్త్రలు, బాలలు, శిశువుల సంక్షేమం, సంరక్షణ కోసం పని చేస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా ఈ విభాగాల్లో 40 మంది పని చేస్తున్నారు. వారికి ప్రభుత్వం మూడు నుంచి ఏడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. దీంతో, దీపావళి పండగ వేళ పిల్లలు నాలుగు టపాసులు కొనమంటే చేతిలో చిల్లిగవ్వ లేక, నిస్సహాయంగా వారి ముఖాలు చూడాల్సి వస్తోందని ఆ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.
శిశుగృహ
ఈ విభాగం చిన్నారుల వసతి, సంక్షేమాన్ని పర్యవేక్షిస్తుంది. ఇందులో మొత్తం 12 మంది ఉద్యోగులున్నారు. వీరిలో మేనేజర్, వైద్యుడు, నర్సు, సోషల్ వర్కర్, చౌకీదారుతో పాటు ఆరుగురు ఆయాలుంటారు. నిర్లక్ష్యానికి గురైన శిశువులు, చెత్తకుప్పల్లో దొరికిన ఆడ శిశువులు, రోడ్లు, ఆసుపత్రుల్లో విడిచేసిన పిల్లలకు శిశుగృహే సొంతిల్లు. ఇక్కడి సిబ్బంది పూర్తి సేవా నిరతితో పని చేస్తూంటారు. ఎవరూ లేని అనాథ చిన్నారులను తమ కన్నబిడ్డల్లా చూసుకుంటారు. వారికి జీతాలు చెల్లించి నాలుగు నెలలైంది. వీరి బాధను కనీసం వినే నాథుడే లేడు.
డొమెస్టిక్ వయోలెన్స్ సెల్
గృహ హింసకు గురైన ప్రతి మహిళకు డొమెస్టిక్ వయోలెన్స్ సెల్ కొండంత బలాన్నిస్తుంది. ఇంటి నుంచి, తమ వారి నుంచి కూడా పొందలేని రక్షణను ఈ సెల్‌లో మహిళ పొందగలుగుతుంది. అక్కడి న్యాయనిపుణులు ఆమె సమస్యకు పరిష్కారం సూచిస్తారు. కష్టం నుంచి బయట పడేంత వరకూ ఆమెకు రక్షణగా నిలుస్తారు. ఈ విభాగంలో సోషల్ కౌన్సిలర్, లీగల్ కౌన్సిలర్, డీఈఓ, ఇద్దరు హోంగార్డులు పని చేస్తున్నారు. వీరిలో పోలీసులకు తప్ప మరెవ్వరికీ మూడు నెలలుగా జీతాల్లేవు. విధులకు రావడానికి కూడా వాహనంలో పెట్రోలు కూడా లేక ఇబ్బంది పడుతున్నామని వారు ఆవేదన చెందుతున్నారు.
ఫ ఏడు నెలలుగా జీతాల్లేవు
ఫ ఉద్యోగుల విలవిల
ఫ ఐసీడీఎస్ అనుబంధ విభాగాల్లో దుస్థితి

పండగ పూటా.. పస్తులే..