
నేడు పీజీఆర్‌ఎస్ రద్దు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని దీపావళి పండగను పురస్కరించుకుని ఈ వారం రద్దు చేశారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుని, ప్రమాదాల బారిన పడకుండా పండగ నిర్వహించుకోవాలని సూచించారు. జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండగ ప్రతి ఇంట్లో వెలుగులు నింపాలని ఆకాక్షించారు. కాలుష్యం లేని, ఆనందకరమైన దీపావళిని ప్రతి ఒక్కరూ నిర్వహించుకోవాలని కోరారు. హరిత టపాసులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
ఉత్సాహంగా ‘చెకుముకి’ పోటీలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహించినట్లు జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.భీమయ్య, ఎన్.రవిబాబు ఆదివారం తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ వివిధ పాఠశాలల్లో ఈ సంబరాలు నిర్వహించామన్నారు.
నాలుగు స్థాయిల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మొదటి స్థాయిలో పాఠశాల స్థాయి సంబరాలకు 8, 9, 10 తరగతుల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. నవంబర్ 1న మండల, పట్టణ స్థాయిల్లో చెకుముకి పరీక్ష జరుగుతుందని, పాఠశాల స్థాయి విజేతలు ఈ పోటీల్లో పాల్గొనాలని సూచించారు.