
బాలల పరిరక్షణ విభాగం
ఇందులో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి (డీసీపీఓ), ముగ్గురు పీఓలు, ఒక కౌన్సిలర్, ఇద్దరు సోషల్ వర్కర్లు, ఒక డేటా ఎనలిస్టు, ఒక అకౌంటెంట్, ఒక ఏడీఈఓ, కింది స్థాయిలో అవుట్‌రీచ్ వర్కర్ (ఓఆర్‌డబ్ల్యు) పని చేస్తూంటారు. రోడ్లపై తిరుగుతున్న బాలల నుంచి, చిన్నారులను చంకనెత్తుకొని భిక్షాటన చేస్తున్న వారి వరకూ.. పిల్లలకు ఎక్కడ ఏ కష్టమొచ్చినా వీరు అమాంతం వాలిపోతారు. బాలల సంరక్షణపై నిత్యం సమావేశాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. బాలల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం రోడ్లు పట్టి, ఎండనక వాననక పాటు పడతారు. ఆ సేవలకు మంత్రముగ్ధులైన కలెక్టరే వారిని ఘనంగా సత్కరించారు. ఇటువంటి కీలక శాఖలోని సిబ్బందికి నాలుగు నెలలుగా ప్రభుత్వం జీతాలు ఇవ్వడం లేదు. దీంతో, వారి ఇళ్లల్లో ఏ పండగకూ సందడి లేకుండా పోయింది. వీరికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి జీతాలు చెల్లించాలి. అయితే, కేంద్రం నుంచి సొమ్ము రాలేదంటూ రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకుంటోంది. బడ్జెట్ విడుదల కాలేదనే సాకుతో మిన్నకుంటోంది.