
వన్‌స్టాప్ సెంటర్
మహిళలు, బాలబాలికలు, మేజర్లు, మైనర్లు ఇలా ఎవరికై నా కష్టమొచ్చిందంటే వారికి కొండంత అండగా నిలుస్తోంది కాకినాడ జీజీహెచ్‌లోని సఖి వన్‌స్టాప్ సెంటర్. బాధితులను సంరక్షించి, తాత్కాలిక వసతి కల్పించి, అన్ని రకాలుగా రక్షణ కల్పిస్తున్నారు. వారి సంరక్షణ కోసం వన్‌స్టాప్ సెంటర్‌లో పోలీసులు, న్యాయ నిపుణులు కూడా పని చేస్తారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ శైలజ ఇటీవల కాకినాడలో పర్యటించిన సందర్భంగా వన్‌స్టాప్ సెంటర్ సేవలను ప్రశంసించారు. ఈ సెంటర్‌కు కలెక్టర్ షణ్మోహన్ స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర అవార్డు అందజేశారు కూడా. ఈ సెంటర్‌లో ఒక అడ్మినిస్ట్రేటర్, పారా లీగల్ పర్సనల్, కౌన్సిలర్, ఐటీ పర్సన్‌తో పాటు కేసు వర్కర్లు ఇద్దరు, సెక్యూరిటీ గార్డులు, హెల్పర్లు ముగ్గురు చొప్పున మొత్తం 12 మంది ఉన్నారు. వీరిలో ఏ ఒక్కరికీ ఏడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. అధికారులు సిఫారసులు చేసినా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ప్రతిష్టంభన కొనసాగుతోంది. జీతాల విడుదలకు రిజర్వు బ్యాంకుకు సిఫారసు చేయాల్సి ఉండగా, ప్రభుత్వం ఆ పని ఇప్పటి వరకూ చేయడం లేదు. దీంతో, ఈ ఉద్యోగుల కంట కన్నీళ్లు తప్పడం లేదు.