పాలనపై పేదవి విరుపు
ప్రచారానికే ప్రాధాన్యం
ఆధునిక సమాజంలో పేదల పరిస్థితులు మెరుగుపడాలంటే ప్రభుత్వం వ్యవస్థాపరమైన కృషి చేయాలి. కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యవసాయం, పాడి పరిశ్రమ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమల ఏర్పాటు తదితర రంగాల్లో పటిష్టమైన కార్యాచరణ లేదు. ప్రచార కార్యక్రమాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
–ఎం.గౌరవ్, పిఠాపురం,
సామాజిక కార్యకర్త
కపిలేశ్వరపురం: జీవితం పూలపాన్పు కాకపోయినా పట్టెడన్నానికి లోటు లేకుండా సాగిపోతే చాలనుకునే వారెందరో.. పేద, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రస్తుత ‘కూటమి’ పాలనలో పేదల బతుకులు రోజురోజుకూ దయనీయంగా మారుతున్నాయి. సంపద సృష్టిస్తానంటూ కబుర్లు చెప్పిన కూటమి అగ్రనేతలు అధికారంలోకి వచ్చాక పేదలను సమస్యల సుడిగుండంలోకి నెట్టేస్తున్నారు. శుక్రవారం అంతర్జాతీయ పేదరిక నిర్మూలనా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది.
ఉమ్మడి జిల్లాలో అన్నం పెట్టే వరి సాగు భూమి ఎక్కువగానే ఉంది. పండ్లు, కూరగాయల తదితర ఉద్యాన పంటలు పండే లంక, మెట్ట ప్రాంతమూ అధికమే. గౌతమి, వశిష్ట గోదావరి నదుల నుంచి పుష్కలమైన సాగునీరు లభ్యత ఇక్కడి ప్రత్యేకత. పారిశ్రామిక ప్రగతికి ప్రాథమిక భూమిక ఉమ్మడి జిల్లా.. ఇంత ప్రాధాన్యం ఉన్నా పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్థిక, సామాజిక సమస్యలతో సతమతమవుతున్నారు. గత టీడీపీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పేదల జీవితాలు తీసికట్టుగా మారాయి. తమ ప్రభుత్వం రాగానే సంపద సృష్టిస్తామని, ఇంటికో ఉద్యోగమిస్తామని ప్రజలను కూటమి నేతలు నమ్మించారు. 15 నెలల వారి పాలనలో కీలకమైన హామీలు ఆచరణకు నోచుకోలేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కల్పించిన ఉపాధి అవకాశాలను సైతం కనుమరుగు చేశారు. కాకినాడ జిల్లాలో 445 గ్రామ సచివాలయాల పరిధిలో 9,015 మంది, 175 వార్డు సచివాలయాల పరిధిలో 3,257 మంది మొత్తం 620 సచివాలయాల పరిధిలో 12,272 మంది వలంటీర్లు ఉండేవారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 512 సచివాలయాల పరిధిలో 9,581 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 119 వార్డు, 393 గ్రామ మొత్తం 512 సచివాలయాల పరిధిలో 9,117 మంది వలంటీర్లు సేవలందించే వారు. వారందరికీ రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామంటూ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం నమ్మబలికి అధికారంలోకి వచ్చాక తొలగించింది. ఇంటింటికీ రేషన్ సరకులు అందజేసేందుకు ఉద్దేశించిన వేలాది మంది ఎండీయూ ఆపరేటర్లను తీసేసింది. ఇలా ఆయా కుటుంబాలకు ఉపాధిని దూరం చేసింది.
గతమెంతో ఘనం
2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోని పేదల జీవన ప్రమాణాలను మెరుగుపర్చే లక్ష్యంతో వ్యవస్థాపరమైన కార్యాచరణ చేసింది. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పటిష్ట చర్యలు తీసుకుంది. ప్రతి కుటుంబానికీ ఏదొక ప్రభుత్వ పథకం ద్వారా క్రమం తప్పకుండా ఆర్థిక లబ్ధి చేకూర్చింది. సచివాలయ, వలంటీర్ వ్యవస్థలను తీసుకొచ్చి వ్యవస్థాపరమైన సంక్షేమాన్ని, ఉద్యోగ కల్పనకు కృషి చేసింది. మహిళా మార్ట్‌లను ఏర్పాటు చేసి ఉపాధి, మార్కెట్ అవకాశాలను మెరుగుపరిచింది. పేద అక్క చెల్లెమ్మలకు రూ.5 లక్షల విలువైన ఇంటి స్థలాన్ని అందజేసే లక్ష్యంతో తూర్పుగోదావరి జిల్లాలో 431, కాకినాడ జిల్లాలో 241 లేఅవుట్లలో సుమారు 90 వేల ఇళ్ల పట్టాలను అందించింది.
సాయం అందక వలసలు
కూటమి వచ్చాక ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలు చాలా వరకూ నిలిచిపోయాయి. తొలి ఏడాదిలో రైతులకు అన్నదాతా సుఖీభవ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎగ్గొట్టారు. చేనేత కార్మికుల కుటుంబానికి ఇస్తామన్న రూ.25 వేలు ఇవ్వనేలేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో గ్రామీణ పేదలు పట్టణ ప్రాంతాలకు, ఇతర వృత్తులకు వలస పోతున్నారు. మండపేట, రామచంద్రపురం నియోజకవర్గాల్లోని చేనేత కార్మికులు ఇతర వృత్తుల్లోకి మళ్లిపోవడం ఉదాహరణ.
కొనలేం.. తినలేం
ప్రస్తుతం నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కూరగాయల ధరలు ఒకొక్కటిగా పెరిగిపోతున్నాయి. ఎండుమిర్చి రూ.180 నుంచి రూ. 220, వెల్లుల్లి రూ. 240 నుంచి రూ.350 ధరలు పెరిగాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్ దుకాణాల్లో ఫిబ్రవరి నుంచి కందిపప్పు సరఫరా నిలిచిపోయింది.
వైఎస్సార్ సీపీ పాలనలో ఇంటి వద్దే రేషన్ సరకులు అందుకుంటున్న లబ్ధిదారులు (ఫైల్)
అంగరలో చేనేత పనిలో మహిళ
చదువుకు సాయం కరవు
ఉమ్మడి జిల్లాలో వేలాది ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయాలు ఉన్నాయి. కోనసీమ జిల్లాలో 608 పాఠశాలలు, 70 కళాశాలలు, తూర్పుగోదావరి జిల్లాలో 635 పాఠశాలలు, 115 కళాశాలలు, కాకినాడ జిల్లాలో 300 పాఠశాలలు, 80 కళాశాలలు ఉన్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇన్‌స్టాల్మెంట్లు చెల్లించక ఇంజినీరింగ్ విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం తొలి ఏడాది తల్లికి వందనం ఆర్థిక సాయాన్ని ఆపేసింది.
కూటమి ప్రభుత్వంలో సంక్షేమం గాలికి
సంపద కాదు సమస్యలు సృష్టిస్తున్న వైనం
ఉపాధి కోసం వలసలు వెళ్తున్న బడుగులు
గత వైఎస్సార్ సీపీ
ప్రభుత్వంలోనే సుస్థిరాభివృద్ధి
నేడు అంతర్జాతీయ
పేదరిక నిర్మూలన దినోత్సవం
పాలనపై పేదవి విరుపు
పాలనపై పేదవి విరుపు


