సదా వేంకటేశం.. స్మరామి స్మరామి
● వైభవంగా వాడపల్లి వెంకన్న
బ్రహ్మోత్సవాలు
● అశేషంగా తరలివచ్చిన భక్తజనం
కొత్తపేట: సదా వేంకటేశం.. స్మరామి స్మరామి.. అంటూ శ్రీవారిని కొలుస్తూ సాగుతున్న బ్రహ్మోత్సవాలు ఆబాలగోపాలాన్ని మురిపిస్తున్నాయి. కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రంలో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడోరోజు గురువారం ప్రత్యేక పూజలు జరిగాయి. అశేష సంఖ్య భక్తజనం తరలివచ్చి వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య కార్యక్రమాలను తిలకించి తన్మయత్వం చెందారు. రాజాధిరాజ అలంకరణలో గజ వాహనంపై ఊరేగిన శ్రీవారిని వీక్షించి పరవశించిపోయారు. దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం వేద పండితుడు ఖండవిల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, అర్చకులు, వేద పండితులు ఉదయం నుంచి రాత్రి వరకూ విశేష పూజలు, హోమాలు, బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈఓ చక్రధరరావు, ఉత్సవ కమిటీ చైర్మన్ ముదునూరి వెంకట్రాజు దంపతులు పూజాదికాలు నిర్వహించారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని, స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఉదయం నుంచి పుణ్యాహవచనం, అష్ట కలశారాధన, లక్ష తులసిపూజ, తిరుప్పావడ సేవ, ప్రధాన హోమాలు, దిగ్దేవతా బలిహరణ, నీరాజన మంత్రపుష్పం, సాయంత్రం స్వస్తివచనం, ప్రధాన హోమాలు, దిగ్దేవతా బలిహరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
గజ వాహనంపై ఊరేగిన శ్రీవారు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి స్వామివారిని రాజాధిరాజ అలంకరణలో గజవాహన సేవ అద్భుతంగా సాగింది. శ్రీవారిని గజ వాహనంపై అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల గోవింద నామస్మరణ నడుమ వేద పండితుల వ్యాఖ్యోపన్యాసంతో ఈ వేడుక కన్నుల పండువగా సాగింది. రాజాధిరాజ అలంకరణ అనేది ఒక దేవతామూర్తిని ‘రాజులకు రాజుగా’ (రాజాధిరాజ), చక్రవర్తిగా అలంకరించే అత్యంత వైభవమైన అలంకారం. ఇది దేవాలయాల్లోని బ్రహ్మోత్సవాల వంటి ఉత్సవాల సమయంలో నిర్వహిస్తారు. దేవుని గజ (ఏనుగు) వాహనంపై ఊరేగిస్తారు. వాడపల్లి బ్రహ్మోత్సవాల్లో ఈ వాహన సేవ నిర్వహించారు. దైవత్వం యొక్క సర్వోన్నత అధికారాన్ని, వైభవాన్ని కీర్తించడం ఈ సేవ ఉద్దేశం. ఈ సేవ భక్తుల కోలాహలం నడుమ విశేషంగా సాగింది. పలువురు ప్రముఖులు, నాయకులు బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
వాడపల్లిలో గజ వాహనంపై స్వామివారికి ఊరేగింపు
బ్రహ్మోత్సవాల్లో శక్తివేషాల ప్రదర్శన
సదా వేంకటేశం.. స్మరామి స్మరామి
సదా వేంకటేశం.. స్మరామి స్మరామి


