ఎస్‌బీఐ బ్రాంచ్‌ను ముట్టడించిన డ్వాక్రా మహిళలు
కరప: డ్వాక్రా సంఘాల సొమ్మును స్వాహా చేసిన బ్యాంక్ సీసీపై చర్యలు తీసుకోకపోవడంపై వేళంగిలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌ను గురువారం కూరాడ గ్రామ డ్వాక్రా మహిళలు ముట్టడించారు. తమ సంఘాల నుంచి దోచుకున్న రూ.95 లక్షలను రికవరీ చేయాలని, అక్రమాలకు పాల్పడిన బ్యాంక్ సీసీపై, ఇందుకు సహకరించిన యానిమేటర్లపై ఇంతవరకూ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూరాడలో 106 మహిళాశక్తి సంఘాలు ఉన్నాయి. వీరి నుంచి ముగ్గురు యానిమేటర్లు సంఘాల పొదుపు, రుణాల వాయిదా సొమ్మును వసూలు చేసేవారు. వేళంగి ఎస్‌బీఐ బ్రాంచ్ కూరాడలో బీసీ పాయింట్ ఏర్పాటు చేసి, కరస్పాండెంట్‌గా చిన్నం ప్రియభారతిని నియమించారు. ముగ్గురు యానిమేటర్లలో ఒకరు చిన్నం మంగ బ్యాంక్ సీసీ భారతి తల్లి కావడం, ఆమెకు మిగిలిన ఇద్దరు యానిమేటర్లు ఆలపాటి బేబీ, ఆచంట మాధవి సహకరించడంతో డ్వాక్రా సొమ్మును కాజేశారు. బ్యాంక్ సీసీ, యానిమేటర్లు ముగ్గురు ఏకమై పొదుపు, వాయిదాల సొమ్మును బ్యాంక్‌కు చెల్లించకుండా పక్కదారి పట్టించి, సొంతానికి వాడుకున్నారు. ఇది గత నెలలోనే బయటపడినా ఇంతవరకూ అధికారుల నుంచి స్పందన కరవైందని మహిళలు వాపోయారు. తమకు న్యాయం చేయాలని వేళంగిలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌ను ముట్టడించారు. కరప పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామన్నారే కానీ ఇంతవరకూ ఎవరూ తమ గ్రామానికి విచారణకు రాలేదన్నారు. డీఆర్‌డీఏ పీడీ వచ్చాక చర్యలు తీసుకుంటారని ఏపీఎం ఎంఎస్‌బీ దేవి చెప్పారని, ఆయన వచ్చారో, లేదో తెలియడం లేదని మహిళలు వాపోయారు. అవినీతికి పాల్పడిన బ్యాంక్ సీసీ భారతిని విధుల నుంచి తొలగించాలని, స్వాహా చేసిన సొమ్మును రికవరీ చేసి డ్వాక్రా గ్రూపులకు చెల్లించాలని అసిస్టెంట్ మేనేజర్ ఎస్.ఫాల్గుణరావుకు వినతిపత్రం అందజేశారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఆయన చెప్పడంలో డ్వాక్రా మహిళలు వెనుతిరిగారు.
స్వాహా చేసిన
రూ.95 లక్షల రికవరీకి డిమాండ్


