ఆ రూ.5.88 లక్షలు ఎక్కడివి?
అమలాపురం రూరల్: తీగ లాగితే డొంక కదిలినట్లు అమలాపురం తహసీల్దార్ అవినీతిపై ఏసీబీ అధికారులకు మరిన్ని ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. ఓ వ్యక్తి స్థలం సర్వే విషయంలో తహసీల్దార్ పి.అశోక్‌ప్రసాద్ రూ.లక్ష లంచం డిమాండ్ చేయడం, కార్యాలయ డేటా ఆపరేటర్, జనుపల్లి వీఆర్‌ఏ పుప్పాల రాము మధ్యవర్తిత్వంలో రూ.50 వేల బేరం కుదరడం, తర్వాత ఆ భూ యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించడం, ఏసీబీ ట్రాప్‌లో తహసీల్దార్, డేట్ ఆపరేటర్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన పరిణామాలు తెలిసిందే. తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు జరిగినప్పుడు లంచం తీసుకుంటున్న రూ.50 వేలతో పాటు అక్కడ రూ.5.88 లక్షలు దొరకడం గమనార్హం. అక్కడ అనధికారికంగా ఉన్న రూ.5.88 లక్షలపై ప్రత్యేక దృష్టిపెట్టి, అసలు ఈ నగదు ఎక్కడిది..? ఎలా వచ్చింది...? అనే కోణంలో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. తహసీల్దార్‌ను అరెస్ట్ చేసిన తర్వాత బుధవారం రాత్రి పొద్దుపోయాక ఏసీబీ అధికారులు తహసీల్దార్ ఇంటికి వెళ్లి విచారించారు. ఆ ఇంట్లో ఉన్న తహసీల్దార్ ల్యాప్‌టాప్‌ను అధికారులు సీజ్ చేశారు. అలాగే అధికారులు అమలాపురం ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి అక్కడా పలువురిని విచారించారు. తహసీల్దార్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను తొలుత రాజమహేంద్రవరానికి తరలించారు. అక్కడి నుంచి విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తీసుకు వెళ్లినట్లు సమాచారం. తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న రూ.5.88 లక్షల నగదు దీపావళి దుకాణాల ఏర్పాటు గురించి లంచంగా వసూలు చేసిన సొమ్మని తెలిసింది. ఏసీబీ అధికారులు కూడా ఆ దిశగానే దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు


