తాండవ నదిలో మునిగి వ్యక్తి మృతి
కోటనందూరు: తాండవ నదిలో మునిగి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన అల్లిపూడి గ్రామంలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. అల్లిపూడి ఎస్సీ పేటకు చెందిన వడ్లమూరి శ్రీను (36) బుధవారం స్నానం చేసేందుకు సమీపంలోని తాండవ నదిలోకి దిగగా, ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయాడు. అప్పటి నుంచి శ్రీను ఆచూకీ కోసం స్థానికులు గాలించగా, గురువారం ఉదయం అతని మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య వడ్లమూరి సంధ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామృకృష్ణ తెలిపారు.


