
అప్పు తీర్చలేక స్నేహితుడి హత్య
● ఆపై భయంతో నిందితుడి ఆత్మహత్యాయత్నం
● వీడిన హత్యకేసు మిస్టరీ
● వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీహరి రాజు
ఏలేశ్వరం: తీసుకున్న అప్పు తీర్చాలని స్నేహితుడు ఒత్తిడి చేయడంతో అతడిని హత్య చేశాడో దుర్మార్గుడు. ఆపై పోలీసులకు దొరికిపోతాననే భయంతో పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆస్పత్రిలో చేరిన అతడిని పోలీసులు విచారణ చేయడంతో హత్య కేసు మిస్టరీ వీడింది. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అడ్డతీగల మండలం కొత్తూరుకు చెందిన బొదిరెడ్డి వెంకటేశ్వర్లు ఈ నెల 4న ఏలేశ్వరంలోని తన కుమారుడు ఆంజనేయులు ఇంటికి వచ్చాడు. అనంతరం ఇంటికి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమయ్యాడు. దీంతో తన తండ్రి కనిపించడం లేదంటూ ఆంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పురుగు మందు తాగి అడ్డతీగల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని పోలీసులు విచారణ చేయగా అతడే వెంకటేశ్వర్లును హత్య చేసినట్టు తేలింది.
కోడిపందేలకు పిలిచి..
బొదిరెడ్డి వెంకటేశ్వర్లుకు ఏలేశ్వరానికి చెందిన వల్లూరి రాజా రమేష్‌తో కోడి పందేల వద్ద స్నేహం కుదిరింది. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్లు నుంచి రాజా రమేష్ రూ.10 లక్షల వరకు అప్పు తీసుకున్నాడు. తన బాకీ తీర్చమని వెంకటేశ్వర్లు ఒత్తిడి తేవడంతో అతడిని కడతేర్చేందుకు రాజా రమేష్ నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో నర్సీపట్నంలో కోడి పందేలు ఉన్నాయని చెప్పి, తనతో కారులో వెంకటేశ్వర్లును తీసుకుని బయలుదేరాడు. మార్గం మధ్యలో మత్తు మందు కలిపిన డ్రింక్‌ను వెంకటేశ్వర్లుకు ఇచ్చాడు. అది తాగి అపస్మారక స్థితిలోకి చేరుకున్న అతడిని హత్య చేసి, అతని వద్ద ఉన్న డబ్బు, బంగారం తీసుకున్నాడు. బురదరాళ్ల ఘాట్ రోడ్డులోని బొంతువలస గ్రామం వద్ద తుప్పల్లో మృతదేహాన్ని పారవేసి వెళ్లి పోయాడు. ఆ డబ్బుతో తాను తీసుకున్న బాకీలను తీర్చాడు. అయితే హత్య కేసులో పోలీసులకు దొరికిపోతాననే భయంతో రాజా రమేష్ పురుగు మందు తాగాడు. ఆస్పత్రిలో చేరిన అతడిని విచారణ చేసిన పోలీసులకు జరిగిన సంఘటన వివరించాడు. చికిత్స అనంతరం ఈ నెల 13న కోలుకోగా ప్రత్తిపాడు సీఐ సూర్య అప్పారావు అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం ప్రత్తిపాడు కోర్టుకు తరలించారు.

అప్పు తీర్చలేక స్నేహితుడి హత్య