
ఇంటికి చేరిన బాలుడు
కాజులూరు: గొల్లపాలెంలో నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన బాలుడు క్షేమంగా ఇంటికి చేరాడు. తల్లి మందలించడంతో మనస్థాపానికి గురై అతడు ఇంటి నుంచి వెళ్లిపోయినట్టు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని చీకట్లవారిపేటకు చెందిన నాగ దినేష్ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. గత ఆదివారం మధ్యాహ్నం మిత్రులతో ఆడుకుంటానని చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు తమ బంధువులు, అతడి స్నేహితులందరినీ విచారించినా ఆచూకీ తెలియలేదు. దీంతో తండ్రి గోవిందరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉండగా నాగ దినేష్ బుధవారం ఉదయం ఇంటికి చేరుకున్నాడు. పాఠశాల పూర్తయిన తర్వాత ఇంటికి రాకుండా స్నేహితులతో తిరుగుతున్నావంటూ తల్లి మందలించడంతో బాలుడు అలిగి వెళ్లిపోయినట్టు పోలీసులు తెలిపారు. విజయవాడకు వెళ్లిపోయిన నాగ దినేష్‌కు ఇంటిపై బెంగరావడంతో ఒక పోలీస్ కానిస్టేబుల్ సహకారంతో తిరిగి ఇంటికి చేరాడు. గొల్లపాలెం ఎస్సై ఎం. మోహన్‌కుమార్ ఆ బాలుడికి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.