
మస్కట్ నుంచి సురక్షితంగా స్వదేశానికి..
అమలాపురం రూరల్: నకిలీ ఏజెంట్ కారణంగా మస్కట్‌లో చిక్కుకుపోయిన ఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లికి చెందిన పిప్పర శ్రీలతను కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అధికారులు స్వదేశానికి సురక్షితంగా తీసుకువచ్చారు. శ్రీలత గత జూన్‌లో మస్కట్ వెళ్లింది. అక్కడ సరైన పని దొరక్కపోవడం, యజమాని వేధింపులు, మూడు ఇళ్లలో పనికి చేరినా లాభం లేక తీవ్ర ఇబ్బందులు పడింది. వీటికి తోడు అనారోగ్య సమస్యలతో భారత రాయబార కార్యాలయానికి వచ్చేసింది. ఆమె సమాచారం మేరకు తండ్రి మల్లవరపు వెంకటేశ్వర్లు.. కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్‌ను ఆశ్రయించారు. తన కుమార్తెను స్వదేశానికి సురక్షితంగా తీసుకురావాలని కలెక్టర్‌కు అర్జీ అందజేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ బృందం అక్కడి భారత రాయబారి ఇంటి రాజ్యలక్ష్మితో సంప్రదింపులు జరిపి, భారత విదేశీ రాయభార మంత్రిత్వ శాఖ సహకారంతో స్వదేశానికి సురక్షితంగా చేర్చినట్టు నోడల్ అధికారి, డీఆర్‌ఓ కె.మాధవి, సమన్వయ అధికారి గోళ్ల రమేష్ బుధవారం తెలిపారు.