
అమ్మ అనుగ్రహం అందరికీ లభించాలి
కాకినాడ రూరల్: అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం అందరికీ లభించాలని కోరుకున్నట్లు కాకినాడ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి అన్నారు. దేవీ నవరాత్రులను పురస్కరించుకుని రమణయ్యపేట శ్రీపీఠంలో గత నెల 22న మహాశక్తి యాగం ప్రారంభమైన విషయం తెలిసిందే. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా వచ్చిన మహిళలు దీక్షా వస్త్రాలు ధరించి లలితా సహస్ర నామాలు పఠిస్తూ భక్తిశ్రద్ధలతో కుంకుమార్చనలు చేశారు. దీంతో, నవరాత్రుల్లో 9వ రోజుకే 100 కోట్ల కుంకుమార్చనలు పూర్తయ్యాయి. అనంతరం విజయ దశమి పర్వదినమైన గురువారం నాడు యాగం పరిపూర్ణమైనట్లు స్వామీజీ ప్రకటించారు. ఉదయం ఒకసారి లలితా సహస్ర నామాలు, దేవీ ఖడ్గమాలతో కుంకుమార్చనలు నిర్వహించి, పూర్ణాహుతి గావించారు. భక్తులు తీసుకువచ్చిన బూరెలను హోమగుండంలో వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వరుసగా మూడేళ్ల పాటు 100 కోట్ల చొప్పున ఇప్పటికి 300 కోట్ల కుంకుమార్చనలు పూర్తయ్యాయని చెప్పారు. వెయ్యి కోట్లు లక్ష్యంగా 400 కోట్ల కుంకుమార్చనలకు వెళ్దామని అన్నారు. యాగం విజయవంతానికి శ్రీపీఠం ట్రస్ట్ చైర్మన్ సుధీర్‌రాజు, రాగిరెడ్డి దొరబాబు (కన్నా), అశోక్, సురేష్ వెన్నుదన్నుగా నిలిచారని చెప్పారు. పీఠంలో 25 సంవత్సరాలుగా ఆస్థాన సంగీత విద్వాంసుడిగా సేవలందిస్తున్న వినుకోట వెంకటేశ్వరరావును సత్కరించారు, సుధీర్‌రాజు బంగారు ఉంగరం ప్రదానం చేశారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా దసరా మరుసటి రోజున శ్రీపీఠంలో ఐశ్వర్యాంబిక అమ్మవారు భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామిగా దర్శనమిచ్చారు. మహాశక్తి యాగానికి రెండు నెలల ముందు నుంచే రిజిస్ట్రేషన్లు చేయించుకుని ఐడీ కార్డులు పొంది, కుంకుమార్చనల్లో పాల్గొని, హాలోగ్రామ్ వేయించుకున్న భక్తులకు శని, ఆదివారాల్లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ ఐశ్వర్య కంకణాలు (రాగి కంకణాలు) పంపిణీ చేయనున్నారు.
21 నుంచి కార్తిక
మాసోత్సవాలు
సామర్లకోట: పంచారామ క్షేత్రమైన సామర్లకోట బాలాత్రిపురసుందరీ సమేత చాళుక్య కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 21 నుంచి నవంబర్ 20 వరకూ కార్తిక మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈఓ బళ్ల నీలకంఠం తెలిపారు. ఉత్సవాలకు సంబంధించి కాలభైరస్వామి ఆలయం వద్ద శుక్రవారం ముహూర్తపు రాట వేశారు. ఆలయ పండితులు వేమూరి సోమేశ్వరశర్మ, సన్నిధిరాజు వెంకన్న, శ్రీకాకుళపు సత్యనారాయణమూర్తి, సన్నిధిరాజు అంజిబాబు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ విలేకర్లతో మాట్లాడుతూ, ఈ నెల 21వ తేదీ రాత్రి ఆలయ ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపం వెలిగించి, కార్తిక మాసోత్సవాలు ప్రారంభిస్తామని చెప్పారు. 22 తేదీ నుంచి భక్తులకు కార్తిక మాస దర్శనాలు ప్రారంభమవుతాయని తెలిపారు. కార్తిక మాసంలో ఆది, సోమవారాలు, పౌర్ణమి రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు. క్యూలైన్లు, ఇతర పనులు శుక్రవారం ప్రారంభిస్తామన్నారు. రాట ముహూర్తం కార్యక్రమంలో ట్రస్టు బోర్డు సభ్యులు కూడా పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీలో
పలువురికి పదవులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురిని అధిష్టానం పలు హోదాల్లో నియమించింది. పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (సీఈసీ) సభ్యులుగా మాజీ ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, జ్యోతుల చంటిబాబులను నియమించారు. స్టేట్ కౌన్సిల్ సభ్యులుగా నెక్కంటి సాయి, ఆవాల లక్ష్మీనారాయణ, చల్లగళ్ల పద్మనాభుడు (దొరబాబు), రావు చిన్నారావు, వడిశెట్టి నారాయణరెడ్డి, గండేపల్లి రామారావు, గోపిశెట్టి వీర వెంకట సత్యనారాయణ (బాబ్జీ), బెజవాడ సత్యనారాయణ, అడ్డూరి ఫణీశ్వర రవికుమార్ నియమితులయ్యారు.
మహాశక్తి యాగం ముగింపు
కార్యక్రమంలో పరిపూర్ణానంద స్వామి

అమ్మ అనుగ్రహం అందరికీ లభించాలి