
శానిటరీ సిబ్బంది ఆకలి కేకలు
● 15వ తేదీ వచ్చినా అందని
ఆగస్టు నెల జీతాలు
● 350 మంది సిబ్బందికి
రూ.59 లక్షల బకాయిలు
అన్నవరం: ఒక నెలలో వచ్చిన సమస్య మరుసటి నెల రాకుండా చూసుకోవడమే మంచి పరిపాలనకు నిదర్శనం. కానీ ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీరవేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో మాత్రం అదే సమస్య ప్రతి నెలా పునరావృతమవుతోంది. ప్రతి నెలా రెండో వారం దాటినా శానిటరీ సిబ్బందికి జీతాలు రాని పరిస్థితి. మా జీతాలు ఎప్పుడిస్తారని ఆ సిబ్బంది ఎదురుచూడడంతోనే సరిపోతోంది. గత ఆరు నెలలుగా ఇదే పరిస్థితి. దేవస్థానంలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు సెప్టెంబర్ 15వ తేదీ వచ్చినా ఆగస్టు నెల జీతం ఇంకా అందకపోవడంతో 350 మంది సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. నెలకు రూ.పది వేలు వచ్చే జీతం రెండు వారాలు గడచినా రాకపోతే వారి పరిస్థితి ఏంటనేది ఊహించొచ్చు. గత ఆరు నెలలుగా జీతాలు ఆలస్యం అవడం దేవస్థానంలో రివాజుగా మారిపోయింది. అయితే ఆగస్టు నెలకు సంబంధించి ఆగస్టు 25న 350 మంది సిబ్బందికి సంబంధించిన పీఎఫ్ చెల్లించి ఆ చలానాలు ఈ నెల రెండో తేదీనే దేవస్థానానికి అందజేసినట్టు శానిటరీ కాంట్రాక్ట్ సంస్థ కనకదుర్గా మేన్‌పవర్ సంస్థ ప్రతినిధి తెలిపారు. 16 మంది కొత్త సిబ్బంది విషయం పక్కన పెట్టి మా 350 మంది శానిటరీ సిబ్బంది జీతాలైనా వెంటనే చెల్లించాలని వారు కోరుతున్నారు. దీనిపై ఈవో వీర్ల సుబ్బారావును వివరణ కోరగా త్వరలోనే జీతాలు వారి అకౌంట్లలో పడేలా చూస్తామన్నారు.