ముడుపు కట్టు.. ముక్క పట్టు! | - | Sakshi
Sakshi News home page

ముడుపు కట్టు.. ముక్క పట్టు!

Aug 9 2025 5:53 AM | Updated on Aug 9 2025 5:53 AM

ముడుప

ముడుపు కట్టు.. ముక్క పట్టు!

మూడు సీక్వెన్స్‌లు.. ఆరు ఢంకాల్లా

సాగుతున్న పేకాట శిబిరాలు

కాసులు పోగేసుకోవడంలో

కూటమి నేతలు బిజీబిజీ

ముఖ్య నేతల కనుసన్నల్లో

యథేచ్ఛగా తమ్ముళ్ల దందా

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఎవరికీ డబ్బులు ఊరకనే రావు అంటుంటారు ఒక నగల వ్యాపారి. కూటమి నేతలకు మాత్రం వద్దంటే డబ్బు వచ్చి పడిపోతోంది ఊరకనే. అందుకు ఎన్నో మార్గాలు. అందులో ఒకటి పేకాట శిబిరాలు. కూటమి నేతల కనుసన్నల్లో ఎన్నో శిబిరాలు విచ్చలవిడిగా నడుస్తున్నాయి. పలు నియోజకవర్గాల్లో పేకాట డెన్‌లు నిర్వహిస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. నియోజకవర్గాల్లో ముఖ్య ప్రజాప్రతినిధులకు మామూళ్లు ముట్టజెబుతూ పేకాట శిబిరాలను అడ్డూ అదుపూ లేకుండా నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరో నెల నుంచే పేకాట శిబిరాలతో పేట్రేగిపోతున్నారు. వీటిని కట్టడి చేసేందుకు పోలీసులు కదనరంగంలోకి దిగినప్పటికీ అధికార పార్టీ పెద్దల అండదండలు, నిర్వాహకుల ముడుపుల ముందు అవి దిగదిడుపు అవుతున్నాయి.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా..

పేకాట శిబిరాల్లో లక్షలు చేతులు మారుతున్నాయి. పేకాట మోజులో పడి మధ్య తరగతి కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. పేకాట డెన్‌ నిర్వహించాలంటే ముందుగా నియోజకవర్గ ముఖ్యనేతతో బేరం కుదుర్చుకోవాలి. పోలీసులతో నెలవారీ మామూళ్ల లెక్కల్లో మాట్లాడుకోవాలి. ఈ ప్రక్రియ అంతటినీ నియోజకవర్గాల నేతల ముఖ్య అనుచరులు చక్కబెడుతున్నారు. నిర్వాహకులు గుట్టు చప్పుడు కాకుండా పేకాటను మూడు ఆసులు, ఆరు ఢంకాలుగా నిర్వహిస్తున్నారు. జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ రూరల్‌, రాజానగరం, కమలనాథులు ప్రాతినిథ్యం వహిస్తున్న అనపర్తి, టీడీపీ ఏలుబడిలో ఉన్న రామచంద్రపురం, మండపేట, ముమ్మిడివరం, అమలాపురం తదితర నియోజకవర్గాలతో పాటు పాండిచ్చేరి కేంద్రపాలిత యానాంలో కూడా విచ్చలవిడిగా పేకాట శిబిరాలు నడుస్తున్నాయి.

లోవ దేవస్థానం సమీపంలోనూ..

తుని మొదలు కాకినాడ రూరల్‌ వరకు డజన్ల కొద్దీ పేకాట శిబిరాలు నడుస్తున్నాయి. తునిలో రెండు స్థావరాల్లో పేకాట నడుస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ లోవ దేవస్థానం సమీపాన ప్రైవేటు రిసార్ట్స్‌, తుని సాయినగర్‌లలో వారంలో మూడురోజులు పేకాట శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. టీడీపీ పెద్దల అండదండలతో తమ్ముళ్ల కనుసన్నల్లో నడుస్తున్న పేకాట స్థావరాలకు విశాఖజిల్లా పాయకరావుపేట, నర్సీపట్టణం నుంచి జూదప్రియులు క్యూకడుతున్నారు. సాయినగర్‌లోని ఒక తేదేపా నాయకుడి ఇంటినే డెన్‌గా మార్చేసిన విషయం తెలిసినా పోలీసులు అటువైపు తొంగి చూడలేని పరిస్థితి. తమ్ముళ్లకు, పోలీసులకు నెలవారీ మామూళ్లు ఇవ్వడంతో పేకాట స్థావరాలకు అడ్డూ అదుపూ లేకుండా ఉంది. కాకినాడ రూరల్‌లో రమణయ్యపేట, ఇంద్రపాలెం, రాయుడుపాలెం తదితర ఐదారు ప్రాంతాల్లో పేకాటక్లబ్‌లు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ నేతకు నమ్మినబంట్లైన ఇద్దరు ముఖ్య అనుచరులు ఈ వ్యవహారాన్ని చక్కబెడుతున్నారని సమాచారం. ఈ పేకాటడెన్‌లలో వారం వారం రూ.50 లక్షలు నుంచి రూ.70 లక్షలు లావాదేవీలు జరుగుతున్నాయి. అన్ని కలిపి నెలకు జనసేన ముఖ్యనేతకు రూ.లక్ష ఇచ్చేలా కుదిరిన ఒప్పందం ప్రకారం మొదటి వారంలోనే సరిపెట్టేస్తున్నారు. స్టేషన్‌కు రూ.50 వేలు ముట్టచెబుతుండబట్టే పోలీసులు అటువైపు కన్నెత్తిచూడటం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

కాషాయం కోటలోనూ..

కాకినాడ రూరల్‌ నియోజకవర్గ సరిహద్దు అనపర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పేకాట స్థావరాలు నడుస్తున్నాయి. కమలనాథులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలోని రామవరం కేంద్రంగా పెద్ద పేకాట శిబిరం నడుస్తోంది. రామవరంతో పాటు కుతుకులూరు, పొలమూరు, దుప్పలపూడి, పీరా రామచంద్రపురం, పెడపర్తిలో పేకాట స్థావరాలు నడుస్తున్నాయి. వీటిలో రామవరం ప్రధాన స్థావరంగా నడుస్తోంది. నియోజకవర్గ ముఖ్యనేత మధ్యవర్తిత్వంతో రామవరం పేకాట డెన్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన గోకులం షెడ్డునే పేకాట శిబిరంగా మార్చేశారు. షెడ్డు నిర్మాణానికి రామవరం గ్రామ పంచాయతీ అనుమతి ఇవ్వగా అధికారులు భయపడి ఎంబుక్‌ రికార్డు చేయకుండా వదిలేశారు. రామవరం పేకాట శిబిరం అనపర్తి, ద్వారపూడి, రాజమహేంద్రవరం, కాకినాడ, కడియం, మండపేట, రావులపాలెం, ద్రాక్షారామం తదితర ప్రాంతాల నుంచి వచ్చే జూదగాళ్లతో కిటకిటలాడుతోంది. బ్యాచ్‌, బ్యాచ్‌లుగా వచ్చి గుట్టచప్పుడు కాకుండా పేకాటడుతున్నా పోలీసులు కిమ్మనడం లేదు. రామవరం డెన్‌లో నిత్యం రూ.70 లక్షల నుంచి రూ.90 లక్షల జూదం జరుగుతోందని అంచనా. ముఖ్యనేత ఇంటికి 500 మీటర్ల దూరంలోనే పేకాట శిబిరం నడుస్తుండటంతో పోలీసులు కూడా చూసీచూడనట్టు పోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల పోలీసులు నిర్వహించిన దాడిలో శిబిరం నిర్వాహకుడి ముఖ్యనేత ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టే ప్రధాన అనుచరుడేనని తేలింది. రామవరం శిబిరంలో ముక్కతిప్పిన రోజు లక్షన్నర ముఖ్యనేతకు ముట్టచెబుతున్నారని సమాచారం. టీడీపీ యువనేత వాటా యువనేతకు వెళ్లిపోతోందంటున్నారు. మంత్రి సుభాష్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రపురం నియోజకవర్గంలో పేకాట స్థావరాలకు కొదవులేకుండా ఉంది. ముచ్చిమిల్లి రోడ్డు, శ్రీ సిటీ, శీలంవారి సావరం, రూరల్‌లోని చోడవరం, అన్నయ్యపేట, కూళ్ల, మసకపల్లి, పామర్రు తదితర ప్రాంతాల్లో పేకాట శిబిరాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. వీటిలో కూళ్ల, మసకపల్లి, పామర్రు శిబిరాలు అధికార పార్టీ పెద్దల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యనేత అండదండలతోనే పేకాట స్థావరాలు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నాయి.

రూ.లక్ష నుంచి లక్షన్నర ముడుపులు..

జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజానగరం నియోజకవర్గంలో పుణ్యక్షేత్రం, శ్రీరామపురం, మల్లంపూడి, శ్రీరంగపట్నం, మధురపూడి, గాడాల, రఘుదేవపురం, వంగలపూడి, మిర్తిపాడులలో పేకాట శిబిరాలు గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. ఇక్కడి ముఖ్యనేతకు నెలనెలా లక్ష నుంచి లక్షన్నర ముడుపులు మూటగడుతున్నారని ఆనోటా ఈ నోటా వినిపిస్తోంది. ఇలా పలు నియోజకవర్గాల్లో పేకాట స్థావరాలు అడ్డూ అదుపులేకుండా నడుస్తున్నా పోలీసులు అడపాదడపా దాడులు చేస్తున్నారు తప్ప జూదాలను అరికట్టడంలో విఫలమవుతున్నారని చెవులు కొరుక్కుంటున్నారు.

ముడుపు కట్టు.. ముక్క పట్టు!1
1/1

ముడుపు కట్టు.. ముక్క పట్టు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement