
సంక్షేమం పట్టని కూటమి ప్రభుత్వం
వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ మైనార్టీసెల్
రాష్ట్ర అధ్యక్షుడు జాన్ వెస్లీ
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ప్రజలు సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బొల్లవరపు జాన్ వెస్లీ అన్నారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు దడాల జాషువాగిరి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలకు రక్షణ కూడా లేకుండా పోయిందన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు వారి స్వార్థం కోసం పనిచేస్తూ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రశ్నిస్తానని రాజకీయాల్లోకి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ముందు అభిమానులను రెచ్చగొట్టి, తర్వాత కులాన్ని రెచ్చగొట్టారన్నారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మతాన్ని రెచ్చ కొడుతూ రాజకీయాన్నీ భ్రష్టు పట్టించారన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి క్రైస్తవులకు ఎలాంటి గౌరవం ఇచ్చారో ఆయన హయాంలో ఎలాంటి సంక్షేమ ఫలాలు అందాయో వివరించారు. అధికారంలో లేనప్పుడే నాయకులుగా ఎదిగే అవకాశం వస్తుందని, పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందన్నారు. ఈ సమావేశంలో క్రిస్టియన్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కుండా జాన్ వెస్లీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్టీఫెన్ ఆనంద్, పార్టీ నాయకులు కృపావరం, లాజరస్, శ్యామలరావు, జయరాజ్, శాంతి ప్రసాద్, నరేంద్ర, ఏసుబాబు పాల్గొన్నారు.