
సత్యసాయి కార్మికులకు ‘చాగల్నాడు’ సిబ్బంది మద్దతు
రాజమహేంద్రవరం రూరల్: రాజమహేంద్రవరంలోని ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ కార్యాలయం వద్ద 32 రోజులుగా సమ్మె చేస్తున్న సత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లయి ప్రాజెక్టు కార్మికులకు శుక్రవారం చాగల్నాడు మంచినీటి ప్రాజెక్టు కార్మికులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యసాయి డ్రింకింగ్ ప్రాజెక్టు కార్మికులకు పెండింగ్‌లో ఉన్న 20 నెలల జీతాలతో పాటు, 26 నెలలు కట్టాల్సిన పీఎఫ్, ఈఎస్‌ఐ సొమ్ములను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంచినీటి ప్రాజెక్టు కార్మికులతో భారీ ఎత్తున నిరసన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లయి ప్రాజెక్టు యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు శ్రీను, ఇస్సాక్, కార్మికులు పాల్గొన్నారు.
సిరుల తల్లి.. కల్పవల్లి
రాయవరం: సిరుల తల్లి.. కల్పవల్లి ప్రణామం అంటూ ఆ వరలక్ష్మీదేవిని భక్తులు కొలిచారు. జిల్లాలో శ్రావణ శుక్రవారం పూజలను ఘనంగా జరుపుకొన్నారు. మహిళలు భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాలు ఆచరించారు. వెదురుపాక విజయదుర్గా పీఠంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఇక్కడ సామూహిక వరలక్ష్మీ వ్రతాలు జరిగాయి. అలాగే వివిధ ప్రాంతాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
గేట్ కోచింగ్‌కు
కలెక్టర్ సాయం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): చిన్న వయసులో తల్లి దండ్రులను కోల్పోయిన ఆ అన్నాచెల్లెళ్లకు కలెక్టర్ కొండంత అండగా నిలిచారు. రాజానగరం మండలం, నందరాడ గ్రామానికి చెందిన మేడిశెట్టి నీరజ, ఎమ్మెస్సీ, జూవాలజీ పూర్తి చేసి డెహ్రాడూన్‌లో గేట్‌లో కోచింగ్ తీసుకోవాలనే కలతో ఉన్నారు. ఆమె అన్న హరికృష్ణ ఆధారంగా జీవనం సాగిస్తున్న ఈ కుటుంబం ప్రస్తుతం ఆర్థికంగా కష్టకాలంలో ఉంది. ఉద్యోగం కోల్పోయిన అన్న, అద్దె ఇంట్లో కష్టాలు పడుతున్న పరిస్థితుల్లో, నీరజ తన ఆశయాన్ని వదులుకోక, కలెక్టర్ ప్రశాంతిని తగిన సహాయాన్ని ఇవ్వవలసిందిగా పీజీఆర్‌ఎస్ ద్వారా కోరారు. కలెక్టర్ పి.ప్రశాంతి వెంటనే స్పందించారు. వారిని గురువారం తన కార్యాలయానికి పిలిపించి భరోసా ఇచ్చారు. ఆమెకు డెహ్రాడూన్‌లో కోచింగ్ కోసం రూ.40,000 చెక్కును అందజేశారు. హరికృష్ణ అర్హతకు తగిన ఉద్యోగం కల్పించే అవకాశాల కోసం చొరవ తీసుకుంటున్నట్లు తెలిపారు.

సత్యసాయి కార్మికులకు ‘చాగల్నాడు’ సిబ్బంది మద్దతు