
హిజ్రా స్థావరాలపై పోలీసుల దాడి
సెలూన్లు, స్పా సెంటర్లలో తనిఖీలు
కాకినాడ క్రైం: జిల్లాలో వ్యభిచార మూలాలు విస్తృతమవుతున్న తరుణంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాకినాడలో సెలూన్లు, స్పా సెంటర్లలో గురువారం విస్తృత తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ పర్యవేక్షణలో కాకినాడ ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్ పర్యవేక్షణలో నగర వన్ టౌన్, టూ టౌన్, త్రీ టౌన్, పోర్టు పీఎస్ పరిధిలో ఉన్న సెలూన్లు, స్పా సెంటర్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేస్తున్నామని ఏఎస్పీ అన్నారు.
హిజ్రా స్థావరాలపై పోలీసుల దాడి
తాళ్లరేవు: జాతీయ రహదారి 216లోని యానాం బైపాస్ రహదారిలో ఉన్న హిజ్రాల స్థావరాలపై కోరంగి పోలీసులు దాడి చేసి, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ కథనం ప్రకారం.. యానాం బైపాస్ రహదారిలోని పెట్రోల్ బంకు నుంచి లచ్చిపాలెం ఆంజనేయస్వామి ఆలయం వరకూ రహదారి చెంతన హిజ్రాలు స్థావరాలు ఏర్పాటు చేసుకుని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇద్దరు హిజ్రాలను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వద్ద హాజరు పరిచి బైండోవర్ చేశారు. హిజ్రాలకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి వారి జీవన విధానాన్ని మార్చుకోవాలని, హితబోధ చేశారు.