
వాడపల్లి హుండీల ఆదాయం రూ.1.53 కోట్లు
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి ఆలయ హుండీల ద్వారా రూ.1.53 కోట్ల ఆదాయం వచ్చిందని దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. 28 రోజుల అనంతరం దేవదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో గురువారం హుండీలను తెరిచారు. ఆయా హుండీల్లో భక్తులు చెల్లించిన నగదుతో పాటు స్వామికి చెల్లించిన ముడుపులను స్వామివారి వసంత మండపంలోకి తెచ్చారు. దేవస్థానం సిబ్బంది, అర్చకులు, స్థానికులు, సేవాదళం భక్తులు, శ్రీవారి సేవకులు నగదు, మొక్కుబడులను విభజించి లెక్కించారు. ఆలయంలో వేంకటేశ్వరస్వామివారి, విశ్వేశ్వరస్వామివారి హుండీల ద్వారా రూ.1.26,78,200, అన్నప్రసాదం హుండీల ద్వారా రూ.26,12,993 సమకూరింది. బంగారం 47 గ్రాములు, వెండి కిలో 600 గ్రాములు, 11 దేశాల కరెన్సీ నోట్లు 24 వచ్చినట్టు ఈఓ చక్రధరరావు తెలిపారు. ఆలయ క్షేత్రపాలకుడు అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామివారి ఆలయ హుండీల ద్వారా రూ.3,45,300 ఆదాయం వచ్చిందన్నారు. పర్యవేక్షణ అధికారులుగా కొత్తపేట మండలం మందపల్లి ఉమామందేశ్వర (శనైశ్చర) స్వామివారి దేవస్థానం ఏసీ అండ్ ఈఓ దారపురెడ్డి సురేష్‌బాబు, దేవదాయ శాఖ రాజమహేంద్రవరం ఇన్‌స్పెక్టర్ టీవీఎస్‌ఆర్ ప్రసాద్, అర్చకులు, గ్రామస్తులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.