
ఆటంకాలు వద్దన్నా..
అల్లవరం: ఎన్నో చిత్ర విచిత్రాలు.. మరెన్నో ఆక్రమణలు.. చూసిన వారు నోరెళ్లబెట్టేలా ఘటనలు.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సాగునీటి వ్యవస్థ తీరు చూస్తే అర్థమవుతోంది. కాలువలు ఎక్కడికక్కడే అధ్వానంగా ఉండడంతో ఇప్పటికే సాగునీరు అందక రైతన్నలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పుడేమో ఉన్న కాలువలను బక్కచిక్కేలా చేస్తున్నా ఆ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. స్వయానా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఇటీవల ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించి, కాలువల వెంబడి ఆక్రమణలను తొలగించి శివారు ప్రాంతాలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించాలని సూచించినా ఆ ఆదేశాలను ఎవరూ ఖాతరు చేయడం లేదు. ఆ వివరాల్లోకి వెళితే.. అల్లవరం మండలం బోడసకుర్రు పంచాయతీ ఐలావారివీధి సమీపంలో ప్రధాన కాలువను ఆనుకుని ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి రెండు అంతస్తుల భవనాన్ని యథేచ్ఛగా నిర్మిస్తున్నారు. కూటమి పార్టీలకు చెందిన కొందరు ఈ నిర్మాణానికి పూనుకున్నట్లు సమాచారం. కాలువలకు సాగునీరు విడుదల చేసేనాటికి రెండు అంతస్తుల భవనం పునాది స్థాయిలో ఉంది. అప్పటి నుంచి నేటి వరకూ ఈ విషయం ఇరిగేషన్ అధికారులకు తెలియకుండా ఉంటుందా అనేది ప్రశ్నగా మారింది. కాలువ వెంట ఆక్రమణలు తొలగించాలని జిల్లా కలెక్టర్, జేసీలు ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా ఆక్రమణ ఎక్కడా ఆగడం లేదు. ఇలా కాలువలను ఆక్రమించుకుని భవనాలు కడితే శివారు ప్రాంతాలకు సాగునీరు ఎలా అందుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇదే కాలువపై ఎంట్రుకోన ఎంపీపీ స్కూల్ వద్ద ఇటీవల వంతెన నిర్మాణం చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా కాలువ వెడల్పును తగ్గించి పనులు చేస్తున్నారు. దీనివల్ల నీటి ప్రవాహం గణనీయంగా తగ్గిందని రైతులు వాపోతున్నారు. కాలువలపై వంతెనలు, కల్వర్టులు నిర్మించేటప్పుడు ఇవన్నీ ఇరిగేషన్ అధికారులు చూడకపోవడం శోచనీయం. ఇప్పటికై నా జిల్లా స్థాయి అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తగిన చర్యలు తీసుకుంటాం
బోడసకుర్రు ప్రధాన కాలువ అంచున రెండతస్తుల భవన నిర్మాణంపై ఇరిగేషన్ కన్జర్వేషన్ అసిస్టెంట్ చంద్రమౌళిని ‘సాక్షి’ వివరణ కోరింది. దీనిపై ఆయన మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న వారికి నోటీసులు ఇచ్చామన్నారు. తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే ఎంట్రుకోన వద్ద నిర్మిస్తున్న వంతెన గురించి ఇరిగేషన్ కన్జర్వేషన్ అసిస్టెంట్ శామ్యూల్‌ను అడగ్గా, ఈ నిర్మాణ పనులు పరిశీలించి, కాలువ వెడల్పు తగ్గినట్లు గుర్తిస్తే సంబంధిత కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇస్తామని చెప్పారు.
కలెక్టర్ హెచ్చరిస్తున్నా బేఖాతర్
ఇరిగేషన్ స్థలం ఆక్రమణ
నిబంధనలకు విరుద్ధంగా
వంతెన, భవన నిర్మాణం

ఆటంకాలు వద్దన్నా..