
శ్రావణం... ఆధ్యాత్మిక తోరణం
కల్యాణ మండపాలకు గిరాకీ
ఈ నెల 26 నుంచి శుభ ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పెళ్లిళ్లు కుదుర్చుకున్న వారు తమ పిల్లల వివాహాలను ఈ ముహూర్తాల్లోనే అట్టహాసంగా జరిపించాలని భావిస్తున్నారు. ఎక్కడికక్కడ కల్యాణ మండపాలు బుక్ అయిపోయాయి. నూతన వైరెటీ కల్యాణ మండపాలు, సరికొత్త ఈవెంట్స్‌ను బుక్ చేసుకుంటున్నారు. ఈ ఏడాది నవంబరు 27 వరకూ ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.
అమలాపురం టౌన్/ కొత్తపేట/సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): శ్రావణం.. అంటే మహిళలు వరలక్ష్మీదేవిని నెలంతా మనసారా కొలిచే మాసం. ఈ నెలలో వచ్చే శుక్రవారాల్లో మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో వ్రతాలను ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవార్ల దేవస్థానాలు, ఆలయాలు ఈ నెల రోజులూ భక్తులతో కిటకిటలాడుతుంటాయి. సామూహిక లక్ష్మీదేవి వ్రతాలకు నిలయమవుతాయి. శ్రావణ మాసం ఈ నెల 25వ తేదీ శుక్రవారం నుంచి మొదలు కావడంతో జిల్లాలోని మహిళలు తమ వీలును బట్టి ఫలానా శుక్రవారం వరలక్ష్మీదేవి వ్రతాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వచ్చే నెల 8న శ్రావణ శుక్రవారం కావడంతో ఆ రోజు జిల్లాలో అధిక సంఖ్యలో మహిళలు వ్రతాలు జరుపుకొనేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ మాసమంతా ప్రతి ఇల్లూ ఓ ఆలయంగా మారి సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువైనట్లుగా భావిస్తారు. ఇళ్లలో వరలక్ష్మీదేవి వ్రతాలే కాకుండా ఇక ఆలయాలు, పలు ఆధ్యాత్మిక సంస్థల ఆధ్వర్యంలో మహిళలతో సామూహిక వ్రతాలు గావించే దృశ్యాలు ఆధ్యాత్మికతకు దర్పణం పడతాయి.
పండగలు.. పూజలు
శ్రావణ మాసంలో పలు పండగలు జరుపుకోనున్నారు. ఈ నెల 25న తొలి శుక్రవారం, వచ్చే నెల ఒకటో తేదీ రెండో శుక్రవారం, 8న మూడో శుక్రవారం, 15న నాలుగో శుక్రవారం, 22న ఐదో శుక్రవారం కావడంతో ఇళ్లలో వ్రతాలు, ఆలయాల్లో సామూహిక వ్రతాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే మాసంలో ఆగస్టు 9న రాఖీ పౌర్ణమి, అదేరోజు జంధ్యాల పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, 15న శ్రీకృష్ణాష్టమి పండగలు జరగనున్నాయి. ఈ మాసంలో మహిళలు మంగళగౌరీ వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తుంటారు. మాంగల్యానికి అధిదేవత అయిన గౌరీదేవిని ప్రతి మంగళవారం ఆరాధిస్తారు.
రూ.8 కోట్లకు పైగా వ్యాపారం
మూఢం కారణంగా 48 రోజులుగా అంతగా విక్రయాలు లేకపోవడంతో పలు వ్యాపారులు నిరాశ చెందారు. శ్రావణం ఆగమనంతో తమ వ్యాపారాలు ఊపందుకుంటాయని ఆనందిస్తున్నారు. పెళ్లిళ్ల ముహూర్తాలు, శుభ కార్యక్రమాలు లేకుండా ఉన్న పురోహితులు ఈ మాసంలో ఒక్కసారిగా బిజీ కానున్నారు. బంగారు దుకాణాలు, పువ్వులు, పండ్లు, మిఠాయి దుకాణాలు రద్దీగా మారనున్నాయి. ముఖ్యంగా పురోహితులు శ్రావణ మాసమంతా బిజీ అవుతారు. బంగారు రూపుల, పువ్వులు, పండ్లు, మిఠాయిల అమ్మకాలతో జిల్లాలో సుమారు రూ.8 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచగా వేస్తున్నారు. జిల్లాలో దాదాపు 800 బంగారు దుకాణాల ద్వారా రూపుల విక్రయాలు జరుగుతాయి. వరలక్ష్మీదేవి వ్రతంలో బంగారు రూపు ఉంచితే సీ్త్రల మాంగల్యపరంగా శుభం జరుగుతుందనేది నమ్మకం. అలాగే జిల్లాలో 1,200 వరకూ పూలు, పండ్ల దుకాణాలు ఉన్నాయి. వ్రతాల్లో అన్ని రకాల పువ్వులు, పండ్లు సమర్పించి లక్ష్మీదేవిని పూజించడం ఆనవాయితీ. దాదాపు రెండు వేలకు పైగా మిఠాయి (స్వీటు) దుకాణాల్లో అమ్మకాలు ఊపందుకోనున్నాయి.
అమ్మవార్ల ఆలయాలకు ముస్తాబు
రాజమహేంద్రవరంలోని దేవీచౌక్‌లో వేంచేసిన శ్రీబాలా త్రిపుర సుందరిదేవి ఆలయం, వంకాయల వారి వీధిలో వరలక్ష్మి దేవాలయం, అష్టలక్ష్మి దేవాలయాలను ముస్తాబు చేశారు. గాడాలలో వేంచేసిన గుడ్లగూబ సమేత శ్రీమహాలక్ష్మిదేవీ ఆలయం ప్రత్యేక శోభను సంతరించుకుంది. అలాగే నగరంలో కోటిలింగాల, పుష్కర, సరస్వతీ, గౌతమ, వీఐపీ ఘాట్‌లకు పుణ్యస్నానాలు ఆచరించడానికి వేలాదిగా భక్తులు వస్తుంటారు. కానీ ఇప్పటి వరకూ ఘాట్లను శుభ్రం చేయకపోవడంతో భక్తులు ఆవేదన చెందుతున్నారు.
నేటి నుంచి సౌభాగ్యాల కాలం
వరలక్ష్మీ వ్రతాలకు మహిళల ఏర్పాట్లు
ప్రారంభం కానున్న పెళ్లిళ్ల సీజన్

శ్రావణం... ఆధ్యాత్మిక తోరణం

శ్రావణం... ఆధ్యాత్మిక తోరణం