
ఈ శిక్షణ మాకొద్దు..!
ప్రత్యామ్నాయం చూసుకున్నాను..
బీఎడ్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసేవాడిని. ఎస్జీటీకి బీఎడ్ చేసిన వారు అనర్హులుగా పేర్కొనడంతో బీఎడ్‌లో చేరే వారి సంఖ్య తగ్గిపోయింది. దీంతో అధ్యాపక వృత్తిని వదిలి అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేసుకుంటున్నాను.
–బొడ్డపాటి సురేష్ కుమార్,
చెల్లూరు, రాయవరం మండలం
ఊహించని పరిస్థితి ఎదురైంది
బీఎడ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ విద్యకు ఇటువంటి పరిస్థితి ఎదురవుతుందని ఊహించలేదు. బీఎడ్, ఎంఎడ్ చేసిన వారికి డీఎడ్ కళాశాలల్లో అధ్యాపకులుగా పనిచేయవచ్చు, కానీ వారిని ఎస్జీటీకి అనర్హులుగా పేర్కొనడం దారుణం.
–డాక్టర్ వైవీ జగన్నాథ్, ప్రిన్సిపాల్,
శ్రీక్షణ ముక్తేశ్వర బీఎడ్ కళాశాల, ముక్తేశ్వరం
రాయవరం: ఉపాధ్యాయ విద్యకు ఆదరణ తగ్గుతోంది. ఉపాధ్యాయులుగా బోధించాలంటే ఛాత్రోపాధ్యాయులుగా శిక్షణ పొందాల్సి ఉంది. ఈ శిక్షణకు ఇంటర్ అర్హతతో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్), డిగ్రీ అర్హతతో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సు చేయాల్సి ఉంది. ఉపాధ్యాయ విద్య అర్హత కోర్సుల్లో బీఎడ్‌కు రెండేళ్ల పాటు శిక్షణ ఇవ్వాలనే నిబంధన 2016 అక్టోబర్ నుంచి అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి బీఎడ్ ప్రవేశ పరీక్షకు అభ్యర్థులు క్రమంగా దూరమవుతున్నారు. 2015కు ముందు బీఎడ్ ప్రవేశ పరీక్షకు వేలల్లో దరఖాస్తులు రాగా, ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వందల్లోనే వస్తున్నాయి. 2025లో బీఎడ్‌లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఎడ్‌సెట్‌కు జిల్లా నుంచి దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఈ కోర్సుకు డిమాండ్ తగ్గుతున్న నేపథ్యంలో ఆ కళాశాలల మనుగడ ప్రశ్నార్థకం కానుంది. 2014–15 విద్యా సంవత్సరం వరకూ బీఎడ్ శిక్షణ కాలం ఒక ఏడాది మాత్రమే ఉండగా, 2015–16 నుంచి రెండేళ్లకు పెంచారు. అదే ఏడాది కేవలం 531 మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.
ఒకప్పుడు పోటీ.. ఇప్పుడు రారేంటి!
ఒకప్పుడు ఉపాధ్యాయ శిక్షణ కోర్సు బీఎడ్‌కు ఎక్కడ లేని పోటీ ఉండేది. జిల్లాలో గడిచిన దశాబ్ద కాలంగా పోటీ తగ్గింది. 2015లో బీఎడ్ ప్రవేశానికి నిర్వహించిన ఎడ్‌సెట్‌కు వెయ్యి మంది కూడా దరఖాస్తు చేసుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 11,701 మంది దరఖాస్తు చేయగా, జిల్లా నుంచి కేవలం 531 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో బీఎడ్ ప్రవేశ పరీక్ష దరఖాస్తులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,462 దరఖాస్తులు రాగా, ప్రవేశ పరీక్షకు 1,125 మంది హాజరయ్యారు. ఒకప్పుడు వేల సంఖ్యలో రాగా ఆ సంఖ్య ఇప్పుడు వందల సంఖ్యకు పడిపోవడం బీఎడ్ కళాశాలల మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తుంది. ఎడ్‌సెట్ ఏర్పాటైనప్పటి నుంచి ఇంత తక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావడం ఆశ్చర్యం కలిగిస్తుందని పలువురు బీఎడ్ కళాశాలల నిర్వాహకులు చెబుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో 1,200 సీట్లు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గతంలో 36 బీఎడ్ కళాశాలలు ఉండేవి. ఈ కళాశాలల్లో చేరేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో కళాశాలల సంఖ్య 22కు పడిపోయింది. బీఎడ్‌కు డిమాండ్ ఉన్న దశాబ్ద కాలం క్రితం ఒక్కో కళాశాలలో 100 వరకూ సీట్లు ఉండగా, ఇప్పుడు ఒక్కో కళాశాలకు 50 మాత్రమే ఉన్నాయి. 22 కళాశాలల పరిధిలో 1,200 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ బీఎడ్ కళాశాలలో 150 సీట్లు ఉండగా, ఒక్కో ప్రైవేట్ కళాశాలలో 50 సీట్లు ఉన్నాయి. 2015–16 విద్యా సంవత్సరంలో 3,600 సీట్లు ఉండగా, కేవలం 500 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.
కారణాలు ఎన్నో..
కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు బీఎడ్ విద్యకు ఆదరణ తగ్గడానికి పలు కారణాలు వినిపిస్తున్నాయి. బీఎడ్ ఉపాధ్యాయ శిక్షణను రెండేళ్లకు పెంచారు. ఒకప్పుడు ఏడాది శిక్షణ ఉండగా, రెండేళ్ల కాల పరిమితికి పెంచారు. ఇదిలా ఉంటే సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు బీఎడ్ చేసిన వారు అనర్హులుగా ప్రభుత్వం నిర్ణయించడంతో ఆ అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లినట్టు అయ్యింది. ప్రతి డీఎస్సీలోనూ ఎస్జీటీ పోస్టులే అధికంగా ఉంటాయి. అధికంగా ఉన్న ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ చేసిన వారు అనర్హులుగా పేర్కొనడంతో బీఎడ్ విద్యకు ఒక్కసారిగా డిమాండ్ పడిపోయింది.
2027–28 విద్యా సంవత్సరం నుంచి..
ఉపాధ్యాయ శిక్షణ పొందే వారిలో బోధనాపరమైన నైపుణ్యాన్ని పెంపొందించేందుకు నేషనల్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ) బీఎడ్ ట్రైనింగ్ కాల వ్యవధిని రెండేళ్లకు పెంచింది. అయితే రెండేళ్ల కాల వ్యవధి ఉన్న బీఎడ్‌కు క్షేత్ర స్థాయిలో ఆదరణ తగ్గిపోవడంతో 2027–28 విద్యా సంవత్సరం నుంచి బీఎడ్ ట్రైనింగ్‌ను ఏడాది కాల పరిమితికి కుదించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారికంగా ఉత్తర్వులు విడుదల కావాల్సి ఉంది. ఏడాది కాల పరిమితికి బీఎడ్ కోర్సు ఉంటే భవిష్యత్తులో బీఎడ్‌కు తిరిగి ఆదరణ ఉండే అవకాశముంటుంది.
ఎడ్‌సెట్‌కు 1,462 మందే దరఖాస్తు
రెండేళ్ల శిక్షణకు
వెనకడుగు వేస్తున్న అభ్యర్థులు
ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ అభ్యర్థులకు
అవకాశం లేకపోవడం కారణమే

ఈ శిక్షణ మాకొద్దు..!

ఈ శిక్షణ మాకొద్దు..!