
నాళంవారి సత్రం భూముల కౌలు వేలం మళ్లీ వాయిదా
తొండంగి: రాజమహేంద్రవరంలోని నాళంవారి సత్రానికి చెందిన శృంగవృక్షంలోని భూముల కౌలు వేలం ప్రక్రియ మళ్లీ వాయిదా పడింది. సత్రానికి చెందిన 268.64 ఎకరాల భూమికి మూడేళ్ల కౌలు కాలం ముగిసింది. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 29న శృంగవృక్షంలో అధికారులు కౌలువేలం నిర్వహించగా పాత బకాయిల చెల్లింపు అనంతరం రైతులు గడువు కోరడంతో అప్పట్లో వాయిదా వేశారు. దాదాపు రెండున్నర నెలల అనంతరం రాజమహేంద్రవరం నాళం వారి సత్రంలో బుధవారం అధికారులు కౌలువేలం నిర్వహించారు. రెండు బిట్లుగా 53.04 ఎకరాలకు కౌలువేలం నిర్వహించగా మిగిలిన భూములకు కౌలువేలం వాయిదా వేసినట్టు సత్రం అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు 24 మంది రైతులు ప్రధమ ధరావతు చెల్లించి వేలంలో పాల్గొన్నారు. మొత్తం 13 బిట్లుగా విభజించి వేలం పాట ప్రారంభించగా మొదటి బిట్టు 27.19 ఎకరాలకు హెచ్చుపాటగా రూ.3.68 లక్షలకు శృంగవృక్షానికి చెందిన యనమల నాగేశ్వరరావు, రెండవ బిట్టు 25.85 ఎకరాలకు హెచ్చుపాటగా రూ.5.01 లక్షలకు మరో రైతు అమృత లోవబాబు కౌలు వేలం ఖరారు చేసుకున్నారు. అనంతరం రైతుల మధ్య వాగ్వివాదం రావడంతో 24 మంది రైతులకు 18 మంది అక్కడి నుంచి వెళ్లిపోయారన్న కారణంతో అధికారులు కౌలు వేలాన్ని వాయిదా వేసినట్టు ప్రకటించారు. మిగిలిన 11 బిట్లు 215.06 ఎకరాలకు త్వరలో కౌలువేలం నిర్వహిస్తామని సత్రం ధర్మకర్త నాళం వెంకటేష్, ఈవో టీవీఎస్‌ఆర్ ప్రసాద్ ప్రకటనలో తెలిపారు.
ఏలేరులో 10.36
టీఎంసీల నీటి నిల్వలు
ఏలేశ్వరం: ఏలేరు ప్రాజెక్టులో బుధవారం నాటికి 10.36 టీఎంసీల నీటినిల్వలు ఉన్నాయి. ఇటీవల వర్షాలకు ప్రాజెక్టులో స్వల్పంగా నీటినిల్వలు పెరిగాయి. ఎగువ ప్రాంతం నుంచి 19.87 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులో చేరుతోంది. దీంతో ప్రాజెక్టులో రూ.86.56 మీటర్లకు 77.15 మీటర్లు, 24.11 టీఎంసీలకు 10.36 టీఎంసీల నీటినిల్వలు ఉన్నాయి. దీంతో ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు 1200, విశాఖకు 150. తిమ్మరాజుచెరువుకు 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
నేడు తలుపులమ్మకు
సహస్ర ఘటాభిషేకం
తుని రూరల్: లోవ దేవస్థానంలో గురువారం సహస్ర ఘటాభిషేకం నిర్వహించేందుకు వేదపండితులు, ప్రధాన అర్చకులు, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 26న ప్రారంభమైన ఆషాఢ మాసోత్సవాలు ఈనెల 24 తో ముగియనున్నాయి. ముగింపు సందర్భాన్ని పురస్కరించుకుని అమ్మవారికి సహస్ర ఘటాభిషేకం నిర్వహించనున్నట్టు ఇన్‌చార్జి డిప్యూటీ కమిషనర్, ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. ఇందులో భాగంగా వేదపండితులు, అర్చకులు సప్తనదీ జలాల కలశాలను ఆవాహనం చేసి విశేషంగా అలంకరించారు. భక్తులు తరలివచ్చి సహస్ర ఘటాభిషేకంలో భాగస్వాములు కావాలన్నారు.