
గుమ్మడికాయల మాటున పశువుల రవాణా
కిర్లంపూడి: పైకి గుమ్మడికాయల లోడు కానీ.. అందులో పశువులను రవాణా చేస్తున్నారు. ఈ మినీ వ్యాన్ తుని నుంచి కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్‌కు వెళుతోంది. దీనిని బుధవారం స్వాధీనం చేసుకుని, కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్టు జగ్గంపేట సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ తెలిపారు. ఆయన వివరాల మేరకు, మినీ వ్యాన్ తొట్టె భాగంలో రెండు ఆవులు, 8 ఎద్దులను ఎక్కించి, అవి లేవకుండా గట్టిగా తాళ్లతో రాడ్లకు కట్టారు. ఎవరికీ అనుమానం రాకుండా వాటిపై చెక్కలు అమర్చి, గుమ్మడికాయల బస్తాల లోడు వేశారు. తమకు అందిన సమాచారంతో స్థానిక ఎస్సై జి.సతీష్ తన సిబ్బందితో కృష్ణవరం టోల్‌ప్లాజా వద్ద వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో మినీ వ్యాన్ పట్టుబడింది. పశువులను కృష్ణుడుపాలెంలో గోశాలకు అప్పగించి, ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై జి.సతీష్ తెలిపారు.
వృద్ధురాలి మృతి
జగ్గంపేట: సీతానగరం వద్ద పురుగు మందు తాగి, చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన దంపతుల్లో వృద్ధురాలు కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. ఎస్సై రఘునాథరావు వివరాల మేరకు, సీతానగరం వద్ద మంగళవారం వృద్ధ దంపతులు సక్కుల సత్యనారాయణ, సక్కుల మంగతాయారు ఆత్మహత్యాయత్నం చేశారు. వారిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సక్కుల మంగతాయారు(65) మృతి చెందినట్టు ఎస్సై తెలిపారు.