
వ్యభిచార గృహాలపై పోలీసుల దాడులు
ఇద్దరు మహిళలపై కేసు
పెద్దాపురం: జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం డీఎస్పీ శ్రీహరిరావు ఆధ్వర్యంలో పోలీసులు స్థానిక వ్యభిచార గృహాలపై దాడులు చేశారు. ఈ దాడుల్లో ఇద్దరు మహిళలపై కేసులు నమోదు చేసినట్టు డీఎస్పీ శ్రీహరిరావు తెలిపారు. స్థానిక వక్కలంక వారి వీధి, మసీదు వీధి, కట్టమూరు పుంత ప్రాంతాల్లో దాడులు చేశామన్నారు. మసీదు వీధికి, కట్టమూరు పుంతకు చెందిన ఇద్దరు మహిళలను మధ్యవర్తుల సమక్షంలో అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశామన్నారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ, ఇటీవల సోషల్ మీడియాలో ఇద్దరు వ్యభిచార వృత్తిలో ఉన్న మహిళల అంశం ప్రసారమైందన్నారు. వీరి మధ్య అనేక ఏళ్లుగా వివాదం నడుస్తోందన్నారు. పెద్దాపురం సీఐ విజయశంకర్ కేసు దర్యాప్తు చేస్తున్నారన్నారు. దాడుల్లో ట్రైనీ డీఎస్పీ జీవన, పెద్దాపురం, సామర్లకోట, జగ్గంపేట, ప్రత్తిపాడు సీఐలు జయశంకర్, కృష్ణభగవాన్, వైఆర్‌కే శ్రీనివాస్, వి.సూరిఅప్పారావు, పలువురు ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.